నానా చెత్త చెదారం రాసి పడెయ్యడానికి కూడా కాగితమే కావాల్సి వస్తోంది కదా..!! ప్చ్ ..
పిల్లలూ… స్కూల్లో రాసుకోవాలన్నా, ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకోవాలన్నా నోటు పుస్తకాలు ఉండాల్సిందే. మరి మీరు రాసుకునే తెల్లటి పుస్తకాలను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా..?
అయితే ఈ ఆకుపచ్చని చెట్ల నుంచి తెల్లని కాగితం ఎలా వస్తుందబ్బా..! అని ఆశ్చర్యంగా ఉంటుంది.
పాపం కాగితం చెట్లనుంచి వస్తుంది. పెద్ద పెద్ద చెట్లున్న చిక్కని అడవులు గల కెనడా, స్వీడన్, ఫిన్లాండ్ లలోనే ఎక్కువగా పేపర్ మిల్లులు వున్నాయి.
కొత్తగా చెట్టు నరికి పడేసేటప్పుడు ముందుగా వాటి తోలు.. అంటే బెరడు వలిచేస్తారు. ఆపై చిన్న చిన్న కొమ్మలు, ఆకులు నరికేస్తారు. ఆవిధంగా మిల్లులకు సరఫరా చేయడానికి చెట్టుని సిద్ధం చేస్తారు.
చెట్ల మొదళ్ళను, కాండాన్ని ముక్కలు ముక్కలుగా చిన్నవిగా యంత్రాల సహాయంతో తరిగివేస్తారు. వాటికి నీరు, కొన్ని రసాయనాలు చేర్చి యంత్రాల్లో పెద్ద పెద్ద ముద్దలుగా చేస్తారు.
ఈ కొయ్య ముద్దలో మట్టి తదితర మలినాలను పోగొట్టి, రసాయనాల సహాయం తో చెట్ల నుండి వచ్చిన గోధుమ రంగును పోగొట్టి మెత్తగా పల్చగా కాగితాలు తయారు చేసి వాటిలో తేమ పోగొడతారు.
దీన్ని వేరే కర్మాగారంలో నీళ్లతో కలిపి ఉడికించి ద్రవరూపంలోకి మారుస్తారు. ఆ ద్రవం యంత్రాల్లో కాలువలా ప్రవహిస్తుంటుంది. దాన్ని వేడితో ఆవిరి చేస్తూ పైన గుండ్రటి బరువైన ఇనుప రాడ్లలాంటివాటితో చదును చేస్తూ పల్చటిగా ఉండే నన్ను(కాగితం) తయారు చేస్తారు. పెద్ద పెద్ద బండిళ్లుగా చుట్టి విక్రయిస్తారు.
మీరు వాడుకునే టెక్స్ట్‌బుక్‌లు, నోట్‌బుక్‌లు తయారు చేసే ఫ్యాక్టరీల వాళ్లు, పత్రికల వాళ్లు ఈ బండిళ్లను కొనుక్కుంటారు. తర్వాతే వాళ్ళకు కావల్సిన సైజుల్లో మమ్మల్ని కత్తిరించి, ముద్రణలు చేసుకుంటారు. బైండింగులూ చేస్తారు.
ఒకటన్ను కాగితాన్ని రీసైకిల్ చేస్తే పదిహేడు చెట్లను కాపాడినట్లే. క పైన్ చెట్టు నుంచి 80,500 కాగితపు షీట్లు తయారవుతాయి.భూమి మీద సాగుచేసే కలపలో 42శాతం కాగితం తయారీకే వాడతారు.వాడేసిన కాగితాల్ని రీసైకిల్ చేసి మళ్లీ దాన్ని కాగితంగా మారుస్తారని మీకు తెలుసా? ఆ కాగితాల్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. దానికి నీటిని కలిపి ఉడకబెడతారు. ముద్రణలు పోయేట్టు డీఇంక్ చేస్తారు. దానిలో రసాయనాలు కలిపి తెల్లటి ద్రవాన్ని తయారు చేస్తారు. దాన్ని కాగితంగా మారుస్తారు.
ఇదీ కాగితం తయారీ వెనుక ఉన్న రహస్యం.