పవన్ కల్యాణ్ అభిమానులం, జనసేన పార్టీ నాయకులమంటూ ఓ యువతిని ఏడుగురు యువకులు మోసం చేసిన ఘటన తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని శుక్రవారం అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి 3.5 కిలోల బంగారు నగలు, కారు, రెండు బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 1.23 కోట్లు ఉంటుందని అంచనా.

వివరాల్లోకి వెళ్తే ఎస్పీ రవిప్రకాశ్ కథనం ప్రకారం.. ఏలూరు వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఓ బంగారు వ్యాపారి కుమార్తెతో తాము పవన్ కల్యాణ్ అభిమానులమంటూ తొలుత యువకులు ఆమెతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. అనంతరం జనసేన పార్టీ‌లో తాము నాయకులమని.. పవన్ కల్యాణ్‌తో మీకు పరిచయం ఏర్పాటు చేస్తామని ఆమెను నమ్మబలికారు. కొద్దిరోజులు అలా ఛాటింగ్‌తో ఆ యువతికి నమ్మకం కలిగించేలా వ్యవహరించిన నిందితులు.. ఆ తర్వాత తమకి డబ్బు చాలా అవసరంగా ఉందని.. నగలు ఇస్తే కొద్దిరోజుల్లోనే తిరిగిచ్చేస్తామని ఆమె దగ్గర ఆభరణాలను తీసుకున్నారు.

అనంతరం ముందు తీసుకున్న నగలను ఇవ్వాలంటే.. మరికొన్ని ఆభరణాలను ఇవ్వాలంటూ బెదిరించి.. పెద్ద‌ఎత్తున ఆభరణాలు ఆమె దగ్గర తీసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 3.5 కిలోల బంగారు ఆభరణాలను నిందితులు యువతి దగ్గర నుంచి తీసుకున్నారు. చివరికి తాను మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏలూరుకి చెందిన సింహాద్రి బాలచందర్, పిల్లా సాయిదేవేంద్ర నాయుడు, విప్పర్తి ప్రాన్సిన్, కొండి రాజేశ్, గుజ్జుల రాజీవ్, తుమ్మలపల్లి అశోక్ కుమార్‌, దత్తి బాలాజీలను అరెస్టు చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here