ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయంతో జనాలు థమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని గడగడలాడుతున్నారు. ఈ నేపధ్యంలో కరోనాని నివారించే ప్రయత్నంలో భాగంగా విదేశాలు సైతం లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నాయన్న సంగతి తెలిసిందే.! ప్రస్తుతం లాక్ డౌన్‌ సందర్భంగా జనాలందరూ ఇంటి దగ్గరే ఉంటూ ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక సెలెబ్రిటీల విషయానికొస్తే వంటింట్లో చేరి క్రొత్త క్రొత్త వంటలపై ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు. మరికొందరైతే పెయింటింగ్, డ్రాయింగ్, జిమ్ అంటూ బిజీబిజీగా గడిపేస్తున్నారు.

ఇవన్నీ ప్రక్కన పెట్టి మన టాలీవుడ్ దర్శకుడు తేజపై ఫోకస్ పెడితే అతను మాత్రం అందరి కంటే భిన్నంగా సినిమా ఫీల్డ్‌కి ఏమాత్రం సంబంధం లేని ఓ క్రొత్త కోర్స్ ని అభ్యసిస్తున్నాడు. ఈమధ్యనే ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన ఓ ఆన్ లైన్ కోర్స్ లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కోర్స్‌ని అందిస్తుంది. కరోనా వైరస్ వ్యాధిని స్టడీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కోర్స్‌లో జాయినైనట్టు మీడియా ప్రతినిధులకు తెలిపాడు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా లాంటి భయంకరమైన అంటువ్యాధులు జనాలపై దాడి చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, భవిష్యత్ లో ఇలాంటి ఊహించని పరిణామాలకు మానశికంగా ఎలా సిద్దంగా ఉండాలో ఈ కోర్స్ ద్వారా తెలుసుకోబోతున్నట్టు, ఈ ప్రయత్నంలో భాగంగా ఒకవేళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోరితే తాను వాలంటర్‌గా పనిచేయడానికి కూడా సిద్దమేనని తెలియజేశాడు.

ఈ సందర్భంగా తేజ ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలో ప్రస్తుతం నెలకొని వున్న కరోనా పరిణామాలపై తనదైన శైలిలో స్పందించాడు. కరోనా మహమ్మారిపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఏదైనా వున్నదున్నట్టుగా కుండబ్రద్ధలు కొట్టినట్లుగా మాట్లాడే తేజ.. కరోనా మహమ్మారి ఇంతిలాగ విజృంభించడానికి ముఖ్యంగా మన దేశ ప్రజల నిర్లక్ష్యమేనని ఆవేదన చెందాడు. ప్రజల ఆలోచనా విధానంలోనూ, వారి ప్రవర్తనలోనూ మార్పు వచ్చి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాని కట్టడి చేయగలమని, అలా చేయకుండా నిర్లక్ష్యంగా వుంటే రానున్న రోజుల్లో రోజుకి లక్ష పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని తేజ తెలియజేశాడు.

ఇంతవరకూ ప్రపంచవ్యాప్తంగా కరోనాకి సంబంధించిన కేసుల జాబితాలో 11వ స్థానంలో ఉన్న భారత్ ఈ 2 వారాల్లోనే 4వ స్థానంలోకి వచ్చిందని.. నేటికీ ప్రజల జీవన వైఖరిలో మార్పు రాకపోతే ఆ లెక్క కోటి దాకా వెళ్లడం ఖాయమంటూ బల్లగుద్ది చెప్పాడు తేజ. కరోనాను అరికట్టాలంటే, వైరస్ నివారణలో భాగంగా ప్రజల జీవన వైఖరిలో ఖచ్చితంగా మార్పు రావాల్సిందేనని తెలియజేశాడు. ఇక తేజ వృత్తిపరంగా ప్రస్తుతం ‘అలిమేలు మంగ వెంకట రమణ’, ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే 2 సినిమాల నిర్మాణంలో తలమునకలై వున్నాడు. మరి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న తేజ కామెంట్స్ పై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here