good news for unemployes

0
217

గుడ్ న్యూస్: నిరుద్యోగులకు నెల నెలా వేతనం.. ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం!!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. బాబు వ‌స్తే జాబు గ్యారెంటీ అంటూ ప‌గ‌లురాత్రి అన‌కుండా చెప్పిన మాట‌నే అదే ప‌నిగా చెప్పారు నాటి టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు. తాను కానీ అధికారంలోకి వ‌స్తే ఇంటికో ఉద్యోగం ప‌క్కా అని చెప్ప‌ట‌మేకాదు.. ఉద్యోగం రాని వారికి నిరుద్యోగ భృతి ఇస్తాన‌న్న భారీ హామీ ఇచ్చారు. బాబు మాట‌ల‌తో నిరుద్యోగ యువ‌త సంబ‌ర‌ప‌డ్డారు. బాబు అధికారంలోకి వ‌స్తే.. త‌మ‌కున్న క‌ష్టాలు తీరుతాయ‌ని భావించారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యంతో అధికారాన్ని చేప‌ట్టారు చంద్ర‌బాబు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్ని ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌లు చేస్తార‌న్న అత్యాశ లేన‌ప్ప‌టికీ.. త‌ర్వాతి ఏడాది అయినా అమ‌లు చేస్తార‌ని ప‌లువురు ఆశించారు. అయితే.. అలాంటి ఆశ‌లేమీ నిజం కాలేదు స‌రిక‌దా.. మూడేళ్లు గ‌డుస్తున్నా.. ఉద్యోగాలే కాదు నిరుద్యోగ భృతి రాని ప‌రిస్థితి.

ఎన్నిక‌ల వేళ ఇచ్చిన హామీని అమ‌లు చేయ‌ని చంద్ర‌బాబు స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న వేళ‌.. ఈ బ‌డ్జెట్‌లో నిరుద్యోగ భృతి కోసం రూ.500కోట్లు కేటాయింపులు చేశారు. తాజాగా నిరుద్యోగుల‌కు నిరుద్యోగ భృతి ఇవ్వాల‌ని బాబు స‌ర్కారు ప్ర‌య‌త్నాలు షురూ చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నేతృత్వంలో మంత్రులు లోకేశ్‌.. అచ్చెన్నాయుడు.. కొల్లు ర‌వీంద్ర‌ల‌తో క‌లిసి స‌బ్ క‌మిటీ ఒక‌టి స‌మావేశ‌మైంది. ఇందులో నిరుద్యోగ భృతి విధివిధానాలు ఖ‌రారు చేయ‌టంపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్లు మాత్ర‌మే గ‌డువు ఉండ‌టంతో.. నిరుద్యోగ భృతిపై ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోలేద‌న్న విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరుగుతోంది.
దీంతో.. ఈ హామీని నెర‌వేర్చాల‌న్న ఆలోచ‌న‌లో బాబు స‌ర్కారు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజా స‌మావేశ‌మ‌ని తెలుస్తోంది. నిరుద్యోగ భృతి ఎంత ఇవ్వాలి? ఎవ‌రిని ఎంపిక చేయాలి? ఎలా చేయాలి? ఎంత మొత్తంలో నిరుద్యోగ భృతిని అందించాలి? బ‌డ్జెట్‌లో కేటాయించిన రూ.500కోట్లు స‌రిపోతాయా? అద‌నంగా నిధులు అవ‌స‌ర‌మైతే.. అదెంత‌? అన్న ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు వెత‌క‌టంతో పాటు.. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎప్ప‌టి నుంచి షురూ చేయాల‌న్న అంశంపైనా కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లుగా చెబుతున్నారు. నెల రోజుల్లో ఎవరికి ఎంత నిరుద్యోగ భృతి ఇస్తారో తేలిపోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here