ఇటీవలే చైనా సేనలతో వీరోచితంగా పోరాడి నేలకొరిగిన కల్నల్ సంతోష్ కుమార్‌ కుటుంబాన్ని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. తెలంగాణ సూర్యాపేట లోని సంతోష్ బాబు ఇంటికి వెళ్లిన కేసీఆర్ రూ.5 కోట్ల సాయాన్ని చెక్కు రూపంలో కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంలో సంతోష్ బాబు తల్లిదండ్రులకు ఒక కోటి రూపాయాలు, ఆయన భార్యకు 4 కోట్లు రూపాయిల చెక్ అందజేశారు. అదే సమయంలో సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాన్ని కూడా సీఎం అందించారు. అంతేకాకుండా హైదరాబాద్ లో ఒక ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తూ పట్టా అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి జగదీవ్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంతోష్ బాబు కుటుంబసభ్యులను పరామర్శించిన తరువాత సీఎం మీడియాతో మాట్లాడుతూ… ‘సంతోష్ బాబు దేశ రక్షణ కోసం తన ప్రాణాలు ధారపోశారు. ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది…’ అని అన్నారు. కాగా, చైనాతో జరిగిన ఘర్షణలో సంతోష్ బాబుతో పాటు మరణించిన 19 మంది జవాన్ల కుటుంబ సభ్యులకు కూడా రూ.10 లక్షల చొప్పున సాయాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ద్వారా అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here