తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా కోవిల్ పట్టికి దగ్గర్లోని సాతాంకుళంలో జరిగిన జయరాజ్, బెనిక్స్ అనే తండ్రి కొడుకులు లాకప్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులపై ప్రజలు మండిపడుతున్నారు. జయరాజ్, బెన్నిక్స్ దారుణంగా హతమార్చారనే పచ్చి నిజం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో ఆ ఏరియా పోలీసుల ప్రవర్తన వివాదస్పదమైంది. ఈ అంశంపై ఎందరో ప్రముఖులు స్పందించారు.

తాజాగా… ప్రముఖ తమిళ దర్శకుడు హరి గోపాల కృష్ణన్ ఇంతవరకూ పోలీసుల హీరోయిజాన్ని కళ్ళకు కట్టినట్లుగా తన సినిమాలలో చూపించానని, ఇలాంటి దారుణాలు జరుగుతున్న నేపథ్యంలో ఇకపై పోలీసుల మీద ఎలాంటి సినిమాలు తీయనని శఫధం చేయడంతో సోషల్ మీడియాలో ని నెటిజన్లు అందరూ తమిళ డైరెక్టర్ హరి గోపాలకృష్ణన్ పైనే ఫోకస్ పెట్టారు. నిన్నా, మొన్నటి వరకు హరి పోలీసుల పరాక్రమాలను హైలైట్ చేస్తూ సింగం, సింగం-2, సామి, సామి-2 వంటి పోలీస్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీస్తూ వచ్చారు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం కారణంగా పోలీసులపై వున్న గౌరవం పోతుందని.. ఇక మీదట ఇలాంటి సినిమాలు తీయనని, పోలీసులను గొప్పగా చూపిస్తూ గతంలో 5 సినిమాలు చేసినందుకు ఇప్పుడు చింతిస్తున్నానని కొందరు అధికారుల అవినీతి కారణంగా మొత్తం పోలీసు శాఖ అంటేనే గౌరవం దిగజారిపోయే దుస్ధితి వస్తుందని, తమిళనాడులో మళ్లీ సంఘటనలు జరగకూడదంటూ ఆవేదన చెందారు హరి.

ఇదిలా వుండగా పోలీసు కస్టడీలో తండ్రి కొడుకులు చనిపోయిన ఘటనపై అటు ప్రజలే కాకుండా తమిళ సినీ పరిశ్రమ కూడా తీవ్రంగా స్పందించింది. ఈ సందర్భంగా బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని సూపర్ స్టార్ రజనీకాంత్ డిమాండ్ చేయడం విశేషం. ఈ సంఘటనపై స్పందించిన మరో సింగం సిరీస్ హీరో సూర్య ఇలాంటి దారుణమైన సంఘటనలను సామాజిక నేరాలుగా పరిగణించాలని తెలిపారు. తమిళ చిత్ర రంగంలో అగ్ర తారగా గుర్తింపు సంపాదించిన నటి ఖుష్బూ మాట్లాడుతూ.. జరిగిన ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపి, దోషులను కఠినాతికఠినంగా శిక్షించాలన్నారు.

ఇంత అమానుషంగా ప్రవర్తించిన పోలీసులను తిట్టిపోశారు సంగీత దర్శకుడు డి.ఇమ్మన్. పోలీసుల క్రూరత్వానికి మరో ప్రాణం బలి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మన మీద ఉందన్నారు ప్రముఖ దర్శకుడు పారంజిత్. ఇంకా ఇదే వివాదంపై స్పందించిన సినీ ప్రముఖులు సమంతా, కాజల్ అగర్వాల్, హన్సిక, హీరో విష్ణు, విశాల్ కూడా పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. బాధితుల కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here