Take care of seasonal fevers

0
241

వర్షాలొస్తున్నాయి.. సీజన్ మారింది, సీజనల్ వ్యాధులయిన దగ్గు, జలుబు, జ్వరాలు మీకు అటాక్ కాకుండా ఇలా చేస్తే సరి!!

సీజన్ మారినప్పుడల్లా వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన బాడీ అడ్జస్ట్ కావడానికి కాస్త టైం పడుతుంది. కాని సడన్ ఛేంజ్ శరీరంలో అనేక సీజనల్ వ్యాధులకు కారణమవుతుంది. ఇప్పుడు వర్షాలతో కొత్త నీరు రావడం, కొన్ని చోట్ల నిలువ ఉండటం, కొందరిలో వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, పారిశుధ్యలేమి తదితర కారణాలతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అలాగే ఆహారం, మంచి నీరు, దోమలు, ఈగల వల్ల కూడా అనేక వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆహారం పరిశుభ్రత లోపిస్తే అతిసార, జాండీస్, టైఫాయిడ్‌ వచ్చేప్రమాదం ఉంది. ఇక తాగునీటితో పాటుగా, పరిసరాల్లో పరిశుభ్రత లోపిస్తే అతిసార, కలరా, టైఫాయిడ్‌ కారకాలయిన దోమలు విజృంబిస్తాయి. దోమ కాటుతో మలేరియా, డెంగ్యూ, ఈగలతో టైఫాయిడ్‌, ఇతర అంటువ్యాధులు, అనూహ్యంగా స్వైన్‌ఫ్లూ వంటి భయంకర వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేసే ఆరోగ్యపరంగా డేంజరస్ వెదర్ ఇది.
వర్షాకాలం వస్తే చాలు అప్పటివరకూ ఎక్కడ వుంటుందో తెలియదు కాని ఒక్కసారిగా వచ్చి పట్టేస్తుంది జలుబు. పెద్దవాళ్లయితే ఏదో విధంగా తట్టుకుంటారు కాని పిల్లలు నీరసించిపోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్ సమస్యలకు కొన్ని నివారణ సూచనలను కింద చూద్దాం..

* జలుబు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఎక్కువ హానికరం కాని పారాసిటమాల్ టాబ్లెట్లు వాడొచ్చు. జలుబు పూర్తిగా దారికి వచ్చే వరకు రోజుకు మూడుసార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిటపట్టాలి.
* రోజులో కనీసం మూడుసార్లయినా పసుపు లేదా, అందుబాటులో ఉండే జండూబామ్ వేసుకుని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు గొప్ప రిలీఫ్ వస్తుంది.
* ఈ సీజన్‌లో నీళ్ల నుంచి అనేక జబ్బులు వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ కాచి వడపోసిన నీళ్లు మాత్రమే తాగితే మంచిది.
* నిమ్మపండు ఈ సీజన్‌లో వచ్చే జలుబు లక్షణాలను త్వరగా తగ్గిస్తుంది. వేడి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జబ్బు నుంచి త్వరగా ఉపసమనం పొందుతారు. శరీరంలోని అదనపు కొవ్వు కూడా కరుగుతుంది.
* మిరియాలు, వెల్లుల్లి, అల్లం.. ఇవన్నీ కూడా ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి. అందుకే వీటిని ఆహారంలోనో, కాఫీ, టీ, పాలల్లోనో వేసుకుని తాగాలి.
* * జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లల ఛాతీపై ఆవనూనెకు వెల్లుల్లి కలిపి మసాజ్ చేయాలి. చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మెల్లగా మసాజ్ చేయాలి.
శరీరానికి మంచినీరు ఎంతో అవసరం. పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి. అప్పుడు శరీరం వ్యాధితో సమర్థంగా పోరాడగలదు. కోల్పోయిన నీటి శాతం వెంటనే భర్తీ అవుతుంది.
డెంగ్యూ ఫీవర్:
సీజనల్‌ ఫీవర్స్ జనం ప్రాణాలు తీస్తున్నాయి. అందులో డెంగ్యూ జ్వరం అత్యంత ప్రమాదకరమైంది. వానాకాలం మలేరియా, టైఫాయిడ్‌తో పాటు డెంగ్యూ జ్వరాలు విజృభింస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ప్రత్యేకంగా డెంగ్యూ అనగానే వణుకు పడుతుంది. అంటువ్యాధుల్లోనే అత్యంత ప్రమాదకరమైనది ఇది. రోజురోజుకి డెంగ్యూ కేసులు పెరిగుతున్నాయి. ఎడిస్‌ ఎజిప్టై దోమ కుట్టడం వల్ల ఈ వైరస్ ప్రబలుతోంది. డెంగ్యూ వ్యాధి వచ్చిన రోగిని కుట్టిన దోమ మరొకరిని కుట్టినా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తుండటం వల్ల ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరు తెలుసుకోవడం మంచిది. సమస్యను ముందుగానే తెలుసుకుని మందులు తీసుకుంటే ప్రమాదం రాకుండా జాగ్రత్తపడొచ్చు. డెంగ్యూ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు. కాబట్టి ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఇంతకీ డెంగ్యూ సోకినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలేంటో ఒకసారి చూద్దాం..
వ్యాధి లక్షణాలు:
– ఉన్నట్టుండి జ్వరం అధికంగా వస్తుంది.
– తలనొప్పి అధికంగా ఉంటుంది.
– కంటిలోపల నొప్పి వచ్చి కంటి కదలికలను తగ్గుతాయి. కన్ను కదిలినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది.
– కండరాలు, కీళ్ల నొప్పులు.
– వాంతి అవుతున్నట్లు అనిపిస్తుంది.
– నోరు(డీహైడ్రేషన్) ఎండిపోతుంది. దాహం ఎక్కువగా అవుతుంది.
– ప్లేట్ల టెల్స్ కౌంట్ లక్షల సంఖ్య నుంచి వేలకు పడిపోతాయి.
– లో బీపీ, చర్మంపై దద్దుర్లు, పొట్టలో వికారంగా ఉండటం.
ఈ లక్షణాలు ఏ ఒక్కటి అనిపించినా వెంటనే డాక్టర్ ను కలవాలి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. డెంగ్యూ నివారణకు ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. వెంటనే స్పందించి జ్వర తీవ్రతను గుర్తించి చికిత్స తీసుకోవాలి.
వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలి:
దోమతెరలు, నివారణ మందులు వాడి దోమ కాటు నుండి విముక్తి పొందొచ్చు. పొడుగు ప్యాంట్లు, పొడుగు చేతులున్న చొక్కాలు వేసుకోవాలి. అన్ని భాగాలు రక్షణ కలిగే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పేటట్లు దుస్తులు వేయాలి. సొంత చికిత్స చేయకూడదు. ఆస్ప్రిన్‌, బ్రూఫెన్‌, కాంబిఫ్లామ్‌, అనాలజిన్‌ లాంటి మాత్రలు తీసుకోకూడదు. జ్వరం వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here