టాలీవుడ్ లో మాస్ చిత్రాలకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడు బి. గోపాల్. అలాగే టాలీవుడ్ లోని కమర్షియల్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ బి. గోపాల్. అంతేకాకుండా తెలుగులో ఫ్యాక్షన్ చిత్రాలకు సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన ఆ దర్శకుడు బి.గోపాల్.

మాస్ అనే పదానికి ప్రతిరూపం బి.గోపాల్ పర్యాయపదం అంటే అతిశయోక్తి కాదేమో. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిధ్వని’, ‘లారీ డ్రైవర్’, ‘స్టేట్ రౌడీ’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘బొబ్బిలి రాజా’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహా నాయుడు’, ఇంద్ర’ ఇలా.. ఎన్నో టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్‌ ను అందించిన ఘనత డైరెక్టర్ బి.గోపాల్ ది. టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ సినిమాలను తెరకెక్కించి హిట్స్ అందించిన అతి కొద్దిమంది దర్శకుల్లో  బి.గోపాల్ ఒకరు. ముందుగా పి.చంద్రశేఖర్ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా చేరిన బి.గోపాల్.. ఆ తర్వాత దర్శకేంద్రుడు  కె.రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌ గా చాలా సినిమాలకు కో డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ తర్వాత డి. రామానాయుడుకు చెందిన సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘ప్రతిధ్వని’ చిత్రంతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ‘ప్రతిధ్వని’ చిత్రాన్ని హిందీలో అనిల్ కపూర్, రేఖలతో ‘ఇన్షాఫ్ కీ అవాజ్’ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అంతే ఇంక వెనక్కి తిరిగి చూడకుండా ఆ తర్వాత ‘కలెక్టర్ గారి అబ్బాయి’ ‘రక్త తిలకం’ వంటి వరుస విజయాలందుకున్నాడు.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఒక్కో హీరోతో బి గోపాల్ ఒక్కో కెమిస్ట్రీని మెయిన్ టైన్ చేస్తాడని చెప్పాలి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో బి.గోపాల్ తీసిన ‘స్టేట్‌రౌడీ’, ‘ఇంద్ర’ సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అలాగే విక్టరీ వెంకటేశ్‌ తో ‘బొబ్బిలి రాజా’, ‘చినరాయుడు’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీలు అందించిన ఘనత కూడా బి.గోపాల్ దే. మరోవైపు సీనియర్ హీరో మోహన్ బాబుతో తెరకెక్కించిన ‘అసెంబ్లీ రౌడీ’, ‘బ్రహ్మ’, ‘అడవిలో అన్న’ మూవీలు కూడా బ్లాక్ బస్టర్ సినిమాలే. మోహన్ బాబు హీరో గా ఎంట్రీ ఇచ్చిన టైంలో అతని సెకండ్ ఇన్నింగ్స్‌ లో బి గోపాల్ తెరకెక్కించిన ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రం మన టాలీవుడ్ కలెక్షన్ కింగ్ కి కీ రోల్ గా పని చేసిందనే చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాత మోహన్ బాబు మళ్లీ విలన్, కామెడీ వేషాలు వేయలేదంటే అది బి.గోపాల్ గొప్పతనమే… ఇక టాలీవుడ్‌లో బాలకృష్ణ, బి.గోపాల్‌ లది హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘లారీడ్రైవర్’, రౌడీ ఇన్‌స్పెక్టర్’, సమర సింహారెడ్డి, నరసింహా నాయుడు’ సినిమాలు తెలుగులో సరికొత్త ట్రెండ్‌ ను క్రియేట్ చేసాయి. వీటి తర్వాత విడుదలైన ‘పలనాటి బ్రహ్మానాయుడు’ మాత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోయింది.

నాటితరం అగ్ర హీరో ఎన్టీఆర్ తో తప్ప ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేశ్, నాగార్జున వంటి అగ్ర హీరోలతోనూ బి.గోపాల్ సినిమాలను తెరకెక్కించాడు. అలాగే నేటి జనరేషన్ హీరోలైన మహేశ్‌తో ‘వంశీ’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘అల్లరి రాముడు’, ప్రభాస్‌ తో ‘అడవి రాముడు’, రామ్‌ తో ‘మస్కా’, గోపిచంద్‌తో ‘ఆరడుగుల బుల్లెట్ వంటి సినిమాలు నిర్మించిన ట్రాక్ రికార్డు బి.గోపాల్ కే సొంతం. ఈయన చివరిసారిగా దర్శకత్వం వహించిన ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రం మాత్రం ఇంకా థియేటర్‌లో విడుదల కాలేదు. మొత్తానికి 35 ఏళ్లకు పైగా తన సినీ కెరీర్‌లో దాదాపు 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బి.గోపాల్ తెలుగు చలన చిత్ర సినీ ప్రస్థానంలో దర్శకుడిగా తనదైన శైలిలో చెరగని ముద్ర వేసాడనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here