జైల్లో ఉంది అస్సలు డేరా బాబా లేక నఖిలినా

అపుడెపుడో… ఇరాక్‌ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌.. సరిగ్గా తనలాగే ఉండే కొందరు డూప్‌లను సిద్ధంగా ఉంచేవాడట. శత్రు దేశాలు యుద్ధం చేస్తే పట్టుబడకుండా… తన డూప్లికేట్‌ను తెరపైకి తెచ్చి బురిడీ కొట్టించేవాడు. సరిగ్గా ఇలాంటి ఉదంతమే మన దేశంలో కూడా జరిగినట్టు కనిపిస్తోంది.

ఇటీవల రేప్‌ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడిన డేరా సచ్ఛా సౌధా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌..కూడా ఇదే పన్నాగం పన్నినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రోహతక్‌ జైలులో ఉన్న బాబా అసలా.. నకిలీనా అనే చర్చ జోరుగా సాగుతోంది. సోషల్‌ మీడియాలోనైతే దీనికి సంబంధించి పెద్ద రచ్చ నడుస్తోంది. అసలు ఈ అనుమానాలు రావడానికి కారణం లేకపోలేదు. జైలుకు వెళ్లక ముందు డేరా బాబా వారం రోజుల పాటు తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించుకున్నాడు. వేడుకల చివరిరోజు అంటే ఆగస్టు 16న హర్యానా విద్యాశాఖ మంత్రి రామ్ విలాస్ శర్మ హాజరై డేరా బాబాను కలుసుకున్నారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలో బాబా తల వెంట్రుకలు చాలా చిన్నగా ఉన్నాయి. అలాగే గెడ్డం కూడా తక్కువగానే ఉంది. సరిగ్గా ఇది జరిగిన 10 రోజుల తరువాత ఆగస్టు 25న బాబాను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా నిర్థారించింది. దీంతో బాబా తన కలుగులోంచి బయటకు రాక తప్పలేదు. ఈ సందర్భంలో అతని గెడ్డం పొడవుగా కనిపించింది. అలాగే తలపై జుట్టు కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడే నెటిజన్లు అసలు సిసలు సీఐడీ పోలీసుల అవతారం ఎత్తారు. 10 రోజుల్లోనే బాబాకు ఇంతలా జుట్టు పెరగడం ఎలా సాధ్యమైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ బాబా విగ్ పెట్టుకున్నాడనుకుంటే అది ఎప్పుడు?… తన బర్త్ డే ఫంక్షన్ రోజునా లేక పంచకుల కోర్టుకు హాజరైనపుడా…? ఇలా ఎవరికి వారు తమకు తోచిన వ్యాఖ్యలు చేస్తున్నారు.

అంతేకాదు కొందరు హెయిర్‌ స్టైలిస్టులు కూడా ఈ చర్చలో జోక్యం చేసుకుని…తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. విగ్‌తో జుట్టును కవర్ చేయవచ్చని వివరిస్తున్నారు. అయితే అరెస్ట్‌ సమయంతో పోలిస్తే… పుట్టిన రోజున అతని జట్టు తక్కువగా ఉండడం వల్లే అసలు ప్రశ్న తలెత్తుతోందని చెప్పారు. మొత్తానికి డేరా బాబా ఏం చేసినా ఇప్పుడు కోట్లాది కళ్లు అతన్ని అనుమానపు చూపులే చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో జైలు వర్గాలు కూడా తమ అనుమానాలు తీర్చుకునే పనిలో ఉన్నట్టు సమాచారం.