బతుకమ్మ తెలంగాణలోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా.

0
1091

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత రాష్ట్రపండుగగా మారిన బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా సాగుతున్నాయి. చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా లేకుండా ఆడవారు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

రాష్ట్రం రాకముందు బతుకమ్మ పండగను కొన్ని జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా చేసేవారు. కాని రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రతి జిల్లాకు నిధులు కేటాయించి, బతుకమ్మను ప్రోత్సహించడంతో పాటు, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు కొనసాగుతున్నాయి.

తెలంగాణలో మాత్రమే సాగే ఈ పూల ఉత్సవంకు పలు కథలు, కారణాలను పెద్దలు చెబుతూ ఉన్నారు. కథల విషయం ఎలా ఉన్నా కూడా ఈ పూల పండుగ వలన వాతావరణం బాగుపడుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. చెరువులు, కుంటల్లో ఈ పూలను వేయడం వల్ల ఆ నీరు శుద్ది అవుతుందని చెబుతున్నారు. బతుకమ్మ పండుగ బొడ్డెమ్మతో మొదలై ఎంగిలి పూల బతుకమ్మతో ముగుస్తుంది.

దసరా ముందు వచ్చే ఈ పూల జాతరకు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది. పూలను ఒక క్రమ పద్దతిలో పేర్చి చిన్నా లేదా పెద్ద సైజ్‌లలో బతుకమ్మలను తయారు చేస్తారు. ఎవరి తాహతకు తగ్గట్లుగా వారు బతుకమ్మను తయారు చేసుకుంటారు. అలా తయారు చేసిన బతుకమ్మను సాయంత్రం సమయంలో ఊర్లోని ఒక నిర్దేశిత ప్రాంతంలో లేదా చెరువు గట్టుపైన బతుకమ్మలను ఒక్కచోట చేర్చి ఆడపడుచులు అంతా కూడా చుట్టు తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆట ఆడుతారు.

గంట నుండి మూడు గంటల వరకు కూడా కొన్ని చోట్ల బతుకమ్మ పాటలు పాడుతూ ఆడవారు ఉత్సవంలా బతుకమ్మను జరుపుకుంటారు. బతుకమ్మలను నీటిలో వదిలేసి తిరిగిరా బతుకమ్మ అంటూ ఒకరికి ఒకరు ప్రసాదాలు తినిపించుకోవడంతో పాటు, సరదాగా కొందరు రంగులు కూడా పూసుకుంటారు. బతుకమ్మను 9 రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు.

ఈ 9 రోజులకు 9 పేర్లు ఉన్నాయి. ఆ 9 రోజుల్లో 9 రకాల ప్రసాదాలను బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు.
ఎంగిలి పూల బతుకమ్మ: నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ :సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..
అలిగిన బతుకమ్మ : నైవేద్యమేమి సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
సద్దుల బతుకమ్మ : ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం.

బతుకమ్మ పండుగ గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఎక్కువగా వినిపించే కథ ఏంటి అంటే… ఒక బాలిక భూస్వాముల అకృత్యాల కారణంగా బలైపోతుంది. ఆమెను ఆ ఊరు ప్రజలు అంతా కూడా కలకాలం బతుకమ్మ అంటూ దీవించారట, అప్పటి నుండి కూడా ఆడపిల్లల పండుగ బతుకమ్మ అయ్యిందని అంటారు.

కొన్ని వందల సంఖ్యలో బతుకమ్మ పాటలు ఉన్నాయి. బతుకమ్మ ఉత్సవం అంటే ఖచ్చితంగా వినిపించే పాట ఉయ్యాల పాట మరియు చందమామ పాటలు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పి, తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తీసుకు వచ్చింది బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచులందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షాలు.