గాలి పటంతో సహా గాల్లోకి ఎగిరిన బాలుడు.. చివరికి ?

ఏదైనా పండగలప్పుడు గాలిపటాలు ఎగురవేస్తున్న క్రమంలో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం. గాలిపటాలు ఎగురవేసే ఈ క్రమంలో కరెంటు తీగలను తగులుకొని, ఎత్తైన భవనాల నుంచి కిందకి పడటం, లేదా గాలిపటాలను ఎగరేసే దారం మెడకు చుట్టుకోవడం వంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకుని ప్రాణాలు సైతం కోల్పోయిన వారు ఉన్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే ఇండోనేషియా లో మరొకటి చోటుచేసుకుంది. గాలిపటం తో సహా గాల్లోకి దాదాపు ముప్పై అడుగుల ఎత్తు ఎగిరి ఓ బాలుడు కింద పడిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఇండోనేషియాలో డిసెంబరు 1న పింగ్సేవూ రీజెన్సీలో అందరూ ఎంతో సంతోషంగా గాలి పటాలను ఎగుర వేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ఈ సందర్భంలోనే భారీ గాలిపటాన్ని ఎగరవేసే సమయంలో ఆ గాలిపటంతో సహా 12 ఏళ్ల బాలుడు దాదాపు ముప్పై అడుగుల వరకు గాలిలోకి ఎగిరిపోయాడు. తర్వాత 30 అడుగుల నుంచి ఒక్కసారిగా కింద పడడంతో స్థానికులు వెంటనే ఆ బాలుని ఆస్పత్రికి తరలించారు.

గాలిపటాన్ని ఎగరవేస్తున్న తన సోదరుడికి సహాయంగా వెళ్ళిన ఈ బాలుడు తక్కువ బరువు ఉండటంతో ఏకంగా గాలిపటంతో పాటు గాలిలోకి ఎగిరి సంఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే బాలుడు పట్టు తప్పడంతో కింద పడ్డాడని, బాలుడి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలియజేశారు. ఈ ప్రమాదంలో ఆ బాలుడి భుజంపై దాదాపు ఆరు ప్రాంతాలలో గాయాలైనట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇలాంటి సమయాలలో పెద్దలు పక్కనుండి పిల్లల చేత గాలిపటాలు ఎగర వేయించాలని కామెంట్లు పెడుతున్నారు. పెద్దలు పక్కన లేకపోతే ఇలాంటి సంఘటనలు మరిన్ని చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయని సదరు నెటిజన్లు తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొట్టేస్తోంది.