దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కోట్లాది మంది వాహనదారులకు ఊరటనిచ్చేలా లైసెన్స్ వ్యాలిడిటీని ప్రస్తుతం ఉన్న 20 ఏళ్ల నుంచి ఏకంగా 50 ఏళ్లకు పెంచే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ఈ మార్పు అమలులోకి వస్తే లైసెన్స్ రినైవల్ కోసం తరచూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గనుంది.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ 20 ఏళ్ల వరకు లేదా నిర్దిష్ట వయసు పరిమితి వరకు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత వైద్య పరీక్షలు, అవసరమైన పత్రాలు సమర్పించి రినైవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడమే కాకుండా డిజిటల్ సేవలను విస్తరించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ కొత్త ఆలోచనను పరిశీలిస్తోంది.
అయితే లైసెన్స్ గడువు పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సంబంధిత శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ప్రాథమిక స్థాయిలో ఉన్న ప్రతిపాదన మాత్రమేనని తెలిపారు. రవాణా వ్యవస్థలో సులభతరం, పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా వివిధ మార్పులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రతిపాదనపై కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రినైవల్స్ తగ్గితే ఆదాయంపై ప్రభావం పడుతుందేమోనని భావిస్తున్నాయి. అయితే డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ సేవల ద్వారా ఆదాయానికి పెద్దగా ఇబ్బంది ఉండదని కేంద్ర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహన యాజమాన్య మార్పిడి, పర్మిట్ రినైవల్ వంటి సేవలను కూడా పూర్తిగా ఆన్‌లైన్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు కార్యాలయాలపై భారం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.
ఇంకో కీలక ప్రతిపాదనగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు డీమెరిట్ పాయింట్ల వ్యవస్థను అమలు చేసే ఆలోచన కూడా పరిశీలనలో ఉంది. తప్పులు చేసిన డ్రైవర్లకు పాయింట్లు తగ్గించి, వాటి ఆధారంగా లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు చేసే విధానం తీసుకురావాలని సూచనలు ఉన్నాయి. అయితే ఈ మార్పుల అమలుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.




























