వాన కాలంలో తప్పని సరిగా కాకరకాయను తినాల్సిందే.. ఎందుకో తెలుసా?

మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో కాకర కాయకు ప్రత్యేక స్థానం ఉంది. కాకరకాయ తినటానికి చేదుగా ఉన్నా మన నిండు జీవితానికి సరిపడా పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి.ముఖ్యంగా కాకరకాయలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు,యాంటీ వైరల్ గుణాలు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొని శరీరానికి అవసరమైన వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

వర్షాకాలంలో కాకరకాయను కేవలం కూర రూపంలోనే కాకుండా జ్యూస్ రూపంలో నైనా వారానికి ఒకసారి తీసుకుంటే సకల వ్యాధులకు సర్వరోగ నివారిణిగా పనిచేసి సీజనల్ గా వచ్చే ప్రమాదకర ఫ్లూజ్వరాల నుంచి రక్షణ కల్పిస్తుంది అంతే కాకుండా కాకరకాయలో ఉండే హైపోగ్లసమిక్ పదార్ధము రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని నియంత్రించి మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.కాకర గింజలలలో రక్తములో గ్లూకోజ్ ను తగ్గించే చారన్‌టిన్‌ ఇన్సులిన్‌ వంటి పదార్ధము ఉంటుంది .

కాకరకాయలో విటమిన్ బి1, విటమిన్ బి2, విటమన్ బి3, థైయమిన్, క్యాల్సియం, బీట కేరొటిన్ ఉన్నాయి.ఇవి శరీరంలో వివిధ రకాల క్యాన్సర్ కారకాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. కాకరకాయలో తక్కువ కెలొరీలూ,ఎక్కువ కార్బొహైడ్రేట్లూ,పీచూ పదార్థం పుష్కలంగా ఉండడంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ఔషధ గుణాలు కలిగిన కాకరకాయను వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఆహారంలో తీసుకోవడం ఎంతో ఉత్తమం.