అక్కినేని తొమ్మది దశాబ్దాల జీవితం అందరికీ తెరిచిన పుస్తకం. జీవితంలో ఎలా ముందుకు రావాలి.. ఓ మనిషికి పట్టుదల ఎంత అవసరం అనేవి అక్కినేని జీవితం పరిశీలిస్తే అర్థమవుతుంది. కృషీవలుడిగా పుట్టి కృషిలో ఉన్న ఖుషీని గుర్తించి.. నిషాను ఆస్వాదించిన ఒక మధురమూర్తిగా తయారవయ్యారు అక్కినేని. ఇండస్ట్రీ అంటే అవలక్షణాలకు నిలయమని ఎప్పట్నుంచో ఓ పేరుంది. అలాంటి చోటు నుంచి వచ్చిన అక్కినేని ఏనాడూ దేనికి బానిస కాలేదు. అన్నింటికీ దూరంగా ఉన్నారు. ఓ యోగిలా జీవనం గడిపారు. అలాగే తెలుగు సినీ రంగంలోని అగ్ర కథానాయకులకి 1980, 90 దశకాల్లో ఘన విజయాల్ని అందించిన దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి. మాస్‌ అనే మాటకి అసలు సిసలు అర్థం చెప్పిన కోదండరామిరెడ్డి… వరుస విజయాలతో తెలుగు సినిమా వాణిజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించారు. వీళ్లిద్దరి ప్రతిభా పాటవాలకు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పడానికి వీరిద్దరి మధ్య యదార్ధంగా జరిగిన ఒక సంఘటనను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ANR గారు చెన్నై నుండి హైదరాబాద్ వచ్చి స్థిరపడిన రోజుల్లో ANRతో సినిమా తియ్యాలంటే హైదరాబాద్ లో మాత్రమే షూటింగ్ జరుపుకోవాలి. కేవలం పాటల చిత్రీకరణ కోసం మాత్రమే ANR చెన్నై వెళ్లేవారు. అప్పట్లో కోదండరామిరెడ్డి డైరెక్టర్ గా, అక్కినేని హీరోగా “దాంపత్యం” అనే సినిమాను ప్లాన్ చేశారు నిర్మాతలు. కోదండరామిబి రెడ్డి డైరెక్టర్ గా బిజీగా ఉన్న రోజులవి. సినిమా ముహూర్తం డేట్ ఫిక్స్ చేశారు నిర్మాతలు. అయితే చెన్నైలో డే & నైట్ షూటింగ్ లతో గంట కూడా తీరిక లేని కోదండరామి రెడ్డి, ముహూర్తం షాట్ కు హైదరాబాద్ కు రావడం కుదరని పరిస్థితులలో, ఆయన ANR గారికి ఫోన్ చేసి.. ముహూర్తం షాట్ చెన్నైలో అంటే ANRకు అసలు నచ్చదని తెలిసీ కూడా “సార్ ముహూర్తం షాట్ చెన్నైలో పెట్టుకుందామా.?” అని ధైర్యం చేసి రిక్వెస్ట్ చేస్తూ అడిగేసారు. అందుకు బదులుగా ANR “సరే ఆలోచించి చెబుతా” అని ఫోన్ పెట్టేశారు. ఆ మర్నాడు ANR, డైరెక్టర్ కోదండరామిరెడ్డికి ఫోన్ చేసి “చెన్నై స్టూడియోలలో వద్దు, ఔట్ డోర్ షూటింగ్ అయితే చూద్దాం” అని అన్నారు. ఆ జవాబు కోసమే ఎదురుచూస్తున్న కోదండరామిరెడ్డి వెంటనే “పాటతో షూటింగ్ ప్రారంభిద్దాం, విజిపి గార్డెన్స్ గానీ లేక విజయ గార్డెన్స్ లో ముహూర్తం షాట్ పెట్టుకుందాం” అనేశారు.

అప్పుడు ANR.. “సరే మళ్ళీ ఆలోచించి చెబుతా” అని ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత ANR నిర్మాతలకు ఓ కే చెప్పినట్టున్నారు. చెన్నైలో ముహూర్తం షాట్ కు ఏర్పాట్లు పూర్తి అయాయి. ANR షూటింగ్ స్పాట్ కు మేకప్ తో రెడీ అయి వచ్చారు. పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత ANR.. “ఏదీ ఒకసారి పాట విందాం ప్లే చేయమన్నారు” పాట వింటున్నప్పుడు సడెన్ గా ఒకచోట ANR గారి మొహంలో రంగులు మారిపోయాయి. అక్కడ దొర్లిన ద్వందార్థం అంత ఇబ్బందికరమైనది కాకపోయినా.. చెన్నైలో ముహూర్తం షాట్ విషయంలో అసలే చిరాగ్గా ఉన్న ANRకు కోపం తారాస్థాయికి చేరుకుంది. ఒక్కసారిగా కుర్చీలోంచి దిగ్గున పైకి లేచి, కోపంగా.. “ANR నటిస్తున్న సినిమా ఇది. నా మీద షూట్ చేస్తున్న ఈ పాటలో ఆ డబుల్ మీనింగ్ పదాలు వాడతారా.. ఏమనుకుంటున్నారు నన్ను.? జూనియర్ ఆర్టిస్ట్ లా కనబడుతున్నానా.? ఈ సినిమాలో నేను నటించాను. ఈ డైరెక్టర్ తో కలిసి పని చెయ్యను” అని అరుస్తూ.. అంతే కోపంతో విగ్గు తీసి నేల కేసి కొట్టి షూటింగ్ స్పాట్ ను వదిలి వెళ్ళిపోయారు. సినీ ప్రారంభోత్సవానికి వచ్చిన పాత్రికేయులు, సినీ ప్రముఖులు ANR కోపాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

ఇక ఈ సినిమా షూటింగ్ అటకెక్కినట్లే అని అనుకుంటూ అక్కడనుంచి నిష్క్రమించారు. హడలిపోయిన నిర్మాతలు ఎలాగోలా ధైర్యం చేసుకుని ANR రూం కు వెళ్ళి బతిమాలినా ఆయన కోపం చల్లారలేదు. “డైరెక్టర్ ను మార్చితీరాల్సిందే” అని తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత నిర్మాతలు ఆ చిత్ర డైరెక్టర్ కోదండరామిరెడ్డి వద్దకు రాగా.. కోదండరామిరెడ్డి కూడా వాళ్లతో.. “ఆ పదం నచ్చకపోతే మార్చమని చెబితే మారుస్తాము కదా.. ఆ మాత్రం దానికి విగ్గు తీసి నేల కేసి కొట్టి ANR గారు వెళ్ళిపోయారా.? నేను కూడా ఈ సినిమా చెయ్యను” అని నిర్మాతలకు చెప్పేసి వేరే సినిమా నిర్మాణంలో నిమగ్నమైపోయారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత తాను చేసిన తప్పును గ్రహించిన ANR హుందాగా దర్శకుడు కోదండరామిరెడ్డి వద్దకు వెళ్ళి సారీ చెప్పారు. వెంటనే కోదండరామిరెడ్డి “మీరు నాకు సారీ చెప్పడమేమిటి సార్.? సినిమా మళ్ళీ మొదలుపెడదామా.? అనడిగితే.. వెంటనే ANR “చేద్దామయ్యా” అని అనేయడం.. వెంటనే “దాంపత్యం” సినిమా షూటింగ్ మొదలై శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని ఆ సినిమా విడుదల కావడం.. 100 రోజులు ఆడడం చకా చకా జరిగిపోయాయి. ANR గారి గొప్పతనం ఏమిటంటే.. చాలా సందర్భాలలో ఈ వివాదం గురించి ఏమీ దాయకుండా.. ఇలా జరిగింది అంటూ జరిగింది జరిగినట్టు ఉన్న విషయాన్ని అందరికీ ఆయనే వివరంగా చెప్పేవారు. ఎంతైనా నాటితరం నటుల జీవన విధానమే వేరు.. ఆ దర్జాయే వేరు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here