‌‌ ముందడుగు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత 1984 లో హీరో కృష్ణ దాదాపు పదకొండు చిత్రాల్లో నటించారు. అందులో విజయవంతమైన చిత్రాలు ముఖ్యమంత్రి, కిరాయి అల్లుడు, దొంగలు బాబోయ్ దొంగలు లాంటి చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాల్లో కంచు కాగడా ఓ ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకోవచ్చు. నందిగామ రామలింగేశ్వర రావు తన అభిమాన నటుడు కృష్ణతో ఇంతకు ముందు లేని భారీ బడ్జెట్ తో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. రామలింగేశ్వరరావు ఎప్పటి నుంచో తన మదిలో మెదులుతున్న నవరసాలు పండించే ఒక పాత్రలో కృష్ణ గారిని చూడాలనుకున్నాడు.

అప్పుడు సత్యానంద్, సత్యమూర్తి, మహారథి ముగ్గురు రచయితలు ఒక కథను తయారు చేయడం జరిగింది. ఆ కథ రామలింగేశ్వరరావు నచ్చడంతో దానిని కృష్ణగారు విని కంచు కాగడా తీయాలనుకున్నారు. ఆ క్రమంలో కృష్ణ 42వ పుట్టినరోజు సందర్భంగా 1984 మే 31న అత్యంత కోలాహలంతో కృష్ణ అభిమానుల సమక్షంలో వాహినీ స్టూడియోలో కంచు కాగడా సినిమాను మొదలుపెట్టారు. కంచుకాగడా నిర్మాణ క్రమంలోనే కోదండరామిరెడ్డి మహాసంగ్రామం అనే సినిమా నిర్మాణ దశలో ఉంది.

1984 ఆగస్టులో ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావును తొలగించి నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈ క్రమంలో హీరో కృష్ణ నాదెండ్ల భాస్కర్ రావు ను అభినందిస్తూ పేపర్లో ఒక ప్రకటన ఇచ్చారు. ఎన్టీ రామారావు అభిమానులు ఈ చర్యను ఖండిస్తూ అప్పుడే విడుదలైన కృష్ణ నటించిన కిరాయి కోటిగాడు నడుస్తున్న సినిమా థియేటర్ కి వెళ్లి సీట్లు చించి వేయడం జరిగింది. ఆ క్రమంలో కృష్ణ మరో చిత్రం దొంగలు బాబోయ్ దొంగలు విడుదలకు సిద్ధంగా ఉంటే ఆ సినిమా నిర్మాత డూండీ వాయిదా వేసుకోవడం జరిగింది. కంచు కాగడా సినిమా విడుదల విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో సినిమాను వాయిదా వేసుకోవడమే మంచిదని సలహా ఇచ్చినప్పటికీ ఆ చిత్ర నిర్మాత రామలింగేశ్వరరావు ధైర్యంతో 1984 సెప్టెంబర్ 28న విడుదల చేయడం జరిగింది. అయితే విజయవాడలో కంచు కాగడా చిత్రం నడుస్తున్న యువరాజ్ థియేటర్ వద్ద పోలీసులు శాంతి భద్రతల పర్యవేక్షణ లో భాగంగా 144 సెక్షన్ విధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here