ఉభయ గోదావరి జిల్లాలో 1976లో చిలకమ్మ చెప్పింది సినిమా షూటింగ్ జరుగుతోంది. తెలుగు సినిమా గమనాన్ని మార్చ బోయే ఓ కుర్రాడు సినిమా షూటింగు జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకొని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సినిమా షూటింగ్ ఆసక్తిగా గమనించాడు తను కూడా సినిమా హీరో కావాలనుకున్నాడు అనుకున్నదే తడవుగా తన మనసులో మాట చిలకమ్మ చెప్పింది హీరో నారాయణరావుతో చెప్పడంతో మద్రాసు వచ్చి నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని వివరించాడు.

వరప్రసాద్ అనే కుర్రాడు ‌మద్రాస్ రైలెక్కి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి నటనలో మెళుకువలు నేర్చుకున్నాడు.ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్,కృష్ణ,శోభన్ బాబు లాంటి అగ్ర నటులకు అగ్రతాంబూలం ఇచ్చే హయాములో మన వరప్రసాద్ సినీరంగంలో అడుగుపెట్టాడు. పునాదిరాళ్లు తో తన కెరీర్ కు పునాది వేసుకుని వరప్రసాద్ కాస్త చిరంజీవి అయ్యాడు.తన విభిన్నమైన డాన్స్,ఫైట్లతో దర్శక నిర్మాతలనే కాకుండా ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేక ముద్ర వేశారు. 1978 మొదలుకొని 1983 వరకు ఐదు సంవత్సరాల్లో దాదాపు 60 చిత్రాల్లో చిరంజీవి నటించారు.1983లో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవి దశ దిశను మార్చేసింది. ఇంతకు ముందు నటించిన 60 చిత్రాలతో రానటువంటి మాస్ ఇమేజ్ ఒక్క ఖైదీ సినిమా తో వచ్చింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ఖైదీ,పసివాడి ప్రాణం, యముడికి మొగుడు,అత్తకి యముడు అమ్మాయికి మొగుడు,జగదేకవీరుడు అతిలోకసుందరి,గ్యాంగ్ లీడర్,ఘరానా మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలతో దూసుకెళుతున్న తరుణంలో 1994,1995 వచ్చేసరికి ముగ్గురు మొనగాళ్లు సినిమా యావరేజ్ తో సరిపెట్టుకోగా ఎస్.పి.పరశురాం బిగ్ బాస్,రిక్షావోడు లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడి నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. సుప్రీం హీరో నుండి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి కి వైఫల్య పరంపరలో ఎన్నో చేదు అనుభవాలను పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇక కథల విషయంలో జాగ్రత్తగా ఉంటూ సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించారు. 1996 సంవత్సరం వచ్చేసరికి ఒక్క సినిమా చేయకుండా కథలు వినడానికే తన విలువైన సమయాన్ని కేటాయించడంతో యాదృచ్ఛికంగానే ఈ సంవత్సరం చిరంజీవి వెండితెరకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందనడంలో లో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. తిరిగి 1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విజయవంతమైన హిట్లర్ సినిమాతో వెండి తెరపై కనిపించి తిరిగి తన జైత్రయాత్రను కొనసాగిస్తూ అప్పటికీ ఇప్పటికీ మెగాస్టార్ గా తన ఉనికిని కాపాడుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here