కింగ్ కోబ్రా హల్ చల్.. హడలిపోయిన అటవీశాఖ అధికారులు.. ఎక్కడో తెలుసా..?

సాధారణంగా పాములు అంటేనే ప్రతి ఒక్కరు భయపడతారు. అదే కింగ్ కోబ్రా కనిపిస్తే.. ఏమైనా ఉందా.. తలుచుకుంటేనే ఒళ్లు ఝల్లుమంటోంది. ఇవి ఎక్కువగా జన సంచారం లేని అడవుల్లో కనిపిస్తుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో మనుషులు తిరిగే ప్రదేశాల్లో కూడా పాములు కనిపించడం మనం చూస్తూనే ఉన్నాం.

కొందరు వాటిని చంపుతుండగా.. మరికొందరు అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి అప్పగిస్తున్నారు. అయితే విజయనగరం జిల్లాలో పార్వతీపురం మండలం చందలంగి అటవీ ప్రాంతంలో కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. కొన్ని రోజుల క్రితం అక్కడ ఏనుగులు బీభత్సం స్పష్టించగా అటవీ అధికారులు వాటిని మరో ప్రదేశానికి తరలించారు. అక్కడ ఉన్న ఏనుగులను గిరిజన గ్రామాల నుంచి అటవీ ప్రాంతంలోకి తరిమేయడానికి ప్రయత్నిస్తుండగా.. కింగ్ కోబ్రాపిల్ల పడగఎత్తి ఒక్కసారిగా బుసలు కొట్టింది.

దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. కింగ్ కోబ్రా పిల్ల ఇక్కడే ఉందంటే.. దాని తల్లి కూడా ఈ ఏరియాలోనే ఉండే ఉంటుందని.. కాసేపు ఆ ప్రాంతమంతా వెతికారు. కానీ ఎక్కడ దొరకలేదు. అయితే చిన్న కోబ్రా కనిపించిందంటే.. పెద్ద కోబ్రా కూడా ఇక్కడే ఉంటుందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తొందరపడి ఆ పాములను చంపడం కానీ హింసించడం కానీ చేయవద్దని స్థానిక ప్రజలను కోరారు. ఎవరికైనా ఇలాంటి సర్ప జాతులు కనబడితే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే ఇక్కడ నివసించే ప్రజలకు మొదటి నుంచి ఇక్కడ కింగ్ కోబ్రా తిరుగుతుందనే అనుమానం ఉండేది. ఈ ఘటనతో అది బలపడిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.