శరత్ బాబు.. విలక్షణమైన సినీ నటుడు. ఒక్క తెలుగు చిత్రాలలోనే కాకుండా తమిళ, కన్నడ సినీ రంగాలలో దాదాపు 220కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులందరినీ మెప్పించిన మంచి నటుడు. హీరోగానే కాకుండా, విలన్ పాత్రలు, తండ్రి పాత్రలు.. ఇలా విలక్షణమైన అన్నీ పాత్రలు పోషించాడు. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. అప్పట్లో తెలుగు సినీ రంగానికి సంబంధించిన రామ విజేతా సంస్ధవాళ్లైన కె.ప్రభాకర్‌, కె.బాబూరావు శరత్ బాబును తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయం చేస్తూ ఆయన పేరును శరత్‌ బాబుగా మార్చేశారు.

హీరోగా శరత్ బాబు మొదటి చిత్రం రామరాజ్యం. ఆ తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించిన తర్వాత బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది చిత్రంలో నటించారు. శరత్ బాబు తన సినిమా కెరీర్ ను నిలుపుకునే ప్రయత్నంలో వున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో మంచినటిగా స్థిరపడిన ప్రముఖ నటి రమాప్రభను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కానీ విచిత్రమేమిటంటే.. టాలీవుడ్‌లో కొందరు సినీ ప్రముఖుల వైవాహిక బంధాలు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటూ వుంటాయి. అందులో శరత్ బాబు, రమాప్రభల సంబంధం గురించి కూడా చెప్పుకోవాలి. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగేళ్ళు పెద్దది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న వీరిద్దరి వివాహ బంధం పద్నాలుగేళ్ల తర్వాత విడాకులతో అంతమైంది.

గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాప్రభ, “నేను నా వ్యక్తిగత జీవిత సంరక్షణ కోసం శరత్ బాబుని పెళ్ళి చేసుకుంటే, శరత్ బాబు మాత్రం కేవలం తన అవసరాలకు మాత్రమే తనని ఉపయోగించుకుని వదిలేయడానికి పెళ్ళి చేసుకున్నాడని, తమది పరస్పర అవకాశవాదపు పెళ్ళి” అని తెలియజేసింది. రమాప్రభతో విడాకులైన తర్వాత 1989లో తమిళ నటుడు నంబియార్‌ కుమార్తె స్నేహలతను పెళ్లి చేసుకున్నాడు శరత్ బాబు. వీళ్ళిద్దరి సంసారం కొన్నాళ్లు సాఫీగా సాగిన తర్వాత ఎందుకనో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో 2011లో కోర్టుకు వెళ్ళి మరీ విడాకులు తీసుకున్నారిద్దరూ. ఆ తర్వాత ఆగస్టు 9, 2013న ముచ్చటగా మూడోపెళ్లికి సిద్ధమైనట్లు శరత్ బాబు పై సోషల్ మీడియాలో రూమర్స్ షికార్లు చేశాయి. అయితే అవన్నీ ఒట్టి గాలి వార్తలేనని ఆ తర్వాత తెలిసింది. ప్రస్తుతానికి కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్న శరత్ బాబు వయస్సు 61 సంవత్సరాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here