Tag Archives: Agri Gold Victims

అగ్రిగోల్డ్ డిపాజిటర్ల ఖాతాల్లో డబ్బు జమ.. ఈ పాపం గత ప్రభుత్వానిదే అంటూ మండిపాటు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్‌ డిపాజిట్లరకు నగదు జమ చేశారు. లక్షల మంది బాధితుల ఖాతాల్లో రూ.666.84 కోట్ల న‌గ‌దు జ‌మ చేసినట్లు సీఎం పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మాట్లాడారు. కష్టపడి సంపాదించుకున్న‌ సొమ్మును అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు నష్టపోయారని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి బాధితులను గుర్తించామని, వారిని ఆదుకుంటున్నామ‌ని వైఎస్ జ‌గ‌న్ తెలిపారు.

రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన 3.86 లక్షల మంది బాధితులకు రూ.207.16 కోట్లు ఇస్తున్న‌ట్లు చెప్పారు. దాదాపుగా 7లక్షల పైచిలుకు డిపాజిటర్లకు 666.84 కోట్లు ఇస్తున్నామని… మొత్తంగా అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు 10.4 లక్షల మందికి రూ.905 కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు న్యాయం చేశామని… రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసిన కుటుంబాలు అన్నింటికీ.. కనీసం రూ.20 వేలైన ఇచ్చే కార్యక్రమం పూర్తయిందని తెలిపారు.

అగ్రిగోల్డ్ బాధితుల‌ను ఆదుకుంటామ‌ని ఎన్నికల ముందు ఇచ్చిన‌ హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు ప్ర‌భుత్వం ఇలా న్యాయం చేయ‌డం దేశంలో ఎక్కడా లేదని ఆయ‌న తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా డ‌బ్బు చెల్లించిందని సీఎం అన్నారు. గత ప్రభుత్వం 2015 లో అగ్రిగోల్డ్ బాధితులుకు న్యాయం చేస్తామని చెప్పి.. మోసం చేసిందని మండిపడ్డారు.

ఇటువంటి మోసాలను గత ప్రభుత్వం ఐదేళ్లుగా చేసిందని గుర్తు చేశారు సీఎం జగన్. కోర్డులో ఈ కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. అవన్నీ క్లియర్ అయిన తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి వచ్చిన అమౌంట్ ను ప్రభుత్వం తీసుకుంటుందని.. మిగిలిన సొమ్మును డిపాజిటర్ల ఖాతాలను జమ చేస్తామని హామీ ఇచ్చారు.