Tag Archives: ceo vijay kumar

నిరుద్యోగులకు హెచ్‌సీఎల్‌ శుభవార్త.. 20,000 ఉద్యోగాల భర్తీ..?

గతేడాది కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆగిపోవడంతో పాటు కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ఉధృతి తగ్గి మారిన పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు కొత్తగా ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించాయి. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ హెచ్‌సీఎల్‌ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాబోయే ఆరు నెలల్లో 20,000 ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనుంది.

హెచ్‌సీఎల్ సీఈవో విజయ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీ ఇప్పటికే అతిపెద్ద ఒప్పందాలను కుదుర్చుకున్న నేపథ్యంలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించారు. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుండటంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో ఇతర కంపెనీలు సైతం కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ భారత్ లోని టాప్ 5 ఐటీ కంపెనీలలో ఒకటి కాగా కొత్త ఏడాదిలో ఈ సంస్థ శుభవార్త చెప్పడంతో ఇతర కంపెనీలు సైతం కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటే అవకాశాలు ఉన్నాయి. నోయిడా కేంద్రంగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ సేవలందిస్తోంది. 2020 సంవత్సరంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ కంపెనీ ఏకంగా 10 బిలియన్‌ డాలర్ల మైలురాయిని చేరుకోవడం గమనార్హం.

రోజురోజుకు డిజిటల్ సేవలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండటం కూడా కొత్తగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడానికి కారణమని చెప్పవచ్చు.