Tag Archives: child labor

బాల కార్మిక చట్టంలో మార్పులు.. 14 ఏళ్ల లోపు పిల్లలను పనులకు తీసుకుంటే.. ఆ తర్వాత చుక్కలే..!

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఎన్నో చట్టాలు వచ్చాయి. అయినా కొన్ని ప్రదేశాల్లో గుట్టు చప్పుడు కాకుండా.. బాలబాలికలను పనిలో పెట్టుకుంటున్నారు. దీంతో వారి అమూల్యమైన బాల్యం మొదట్లోనే మోడు బారిపోతోంది. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదానికి తూట్లు పొడిచే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారు.

దీనిపై కఠిన చట్టాలు ఉన్నా.. దీనిని ఎవరూ ఖాతరు చేయడం లేదు. తమ కుటుంబ పోషణ భారం అవుతుందని తమ పిల్లలను పనికి పంపిస్తున్నామని.. బడికి పంపించే స్థోమత లేకనే ఇలా చేస్తున్నామని ఆ బాలబాలికల తల్లిదండ్రలు చెబుతుండటం కొసమెరుపు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే ఉంది. అయితే ఇది సామాజిక-ఆర్థిక సమస్యతో ముడిపడి ఉండడం వల్లనూ, దారిద్ర్యంతోనూ, నిరక్షరాస్యతతోనూ కూడినది కావున ఇంకనూ సమాజంలోని అన్ని వర్గాల వారి సమస్యల్ని పరిష్కరించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలని నిపుణులు అంటున్నారు.

రాజ్యాంగంలోని 24వ ఆర్టికల్ ప్రకారం 14 ఏళ్ల లోపు బాలలను కర్మాగారాలలో, గనులలో, ఇంక ఏ ఇతర ప్రమాదకర పనులలో కూడా ఎవరూ ఉంచకూడదు. దీనిలో భాగంగానే 1986లో బాల కార్మిక నిషేద చట్టం వచ్చింది. ఇదంతా ఇలా ఉండగా.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్పులను తీసుకొచ్చింది.

14 ఏళ్లలోపు పిల్లలు ఎవరూ పనులు చేయడానికి వీళ్లేదని.. ఒక వేళ ఎవరైనా పనిలో పెట్టుకుంటే.. పెట్టుకున్న యజమానితో పాటు.. తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అంతే కాకుండా.. యజమానికి రూ.25వేల నుంచి రూ. 50 వేల జరిమానాతో పాటు 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ నిబంధనలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని.. యాథావిధిగా ఈ నిబంధనలను అమలు చేస్తామని కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.