Tag Archives: covid vaccine in sindh

టీకా వేసుకోలేదా..? అయితే జీతాలు కట్!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడం కోసం మన ముందున్న ఒకే ఒక మార్గం వ్యాక్సిన్. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా బారిన పడినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం ఉండదని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.సాధారణ ప్రజలను అలా ఉంచితే ప్రభుత్వ ఉద్యోగులు సైతం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదని, ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కీలక నిర్ణయాన్ని పాకిస్తాన్ లోని సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మురాద్అలీ షా ఉపక్రమించారు.

రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉంటారో అలాంటి వారికి వచ్చే నెల నుంచి జీతాలు కట్ చేయనున్నట్లు మురాద్అలీ షా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలలో వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ అధికారులు వెనకడుగు వేయడంతో ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సింధ్ ప్రావిన్సుల కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలోనే సీఎం ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రధాన కార్యదర్శి, వైద్య నిపుణులు, ఇతర ఉన్నతాధికారులు హాజరుకాగా ప్రభుత్వ ఉద్యోగులు టీకా వేయించుకోవడానికి ఒక నెల సమయం ఇచ్చారు. ఈ లోగ వ్యాక్సిన్ వేయించుకోకపోతే వారికి జీతాలు కట్ చేయాల్సిందిగా ఆర్థిక శాఖకి ఆదేశాలు జారీ చేసింది.

జూన్ 7వ తేదీ నుంచి పాఠశాలలో తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో జూన్ 5వ తేదీలోగా ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సింధ్ సర్కారు ఆదేశించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,550,553 మందికి టీకా వేయగా.. 4,29,000 మంది రెండు డోసుల వేయించుకున్నారు.ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగించడం కోసం అదనంగా మూడు వందల వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు,అదేవిధంగా ఒక్కో తాలూకాకు 5 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.