Tag Archives: dasara bonus

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన తెలంగాణ సర్కార్.. ఎంతంటే?

ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ను ప్రకటించారు సీఎం కేసీఆర్. సింగరేణి సంస్థ లాభాల్లో 29 శాతం వాటాను బోనస్‌గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది బోనస్‌కు అదనంగా 1 శాతం పెంచి 29 శాతం బోనస్‌గా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈ బోనస్ ను దసరా కంటె ముందే వారి వారి అకౌంట్లలో జమ చేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సింగరేణి కార్యకలాపాలను మరింత విస్తరించాలని సీఎం పేర్కొన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధి, సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. కార్మికులు ఎంతో కష్టపడి పని చేయడం వల్లనే దేశంలోనే ఉన్నత స్థానం లభించిందని గుర్తు చేశారు.

బొగ్గు తవ్వకంతో పాటు రాష్ట్రంలో ఖనిజాల తవ్వకాలను చేపట్టి కార్మికులకు పని, ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వమే పూనుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ఎంతవరకు సమంజసం అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. రిటైర్డ్ సిబ్బందికి వస్తున్న పింఛన్ ను కూడా రూ. 2వేల నుంచి పెంచే యోజనలో ప్రభుత్వం ఉందంటూ స్పష్టం చేశారు.

బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ రూ.72, 500 చెల్లించేందుకు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు అంగీకరించాయని.. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో యాజమాన్యాలు బోనస్‌పై చర్చించి పరస్పర అంగీకారానికి వచ్చాయన్నారు. గత సంవత్సరం రూ.68,500గా బోనస్ ప్రకటించగా.. ఈ మొత్తాన్ని ప్రస్తుత సంవత్సరంలో పెంచారు. దీంతో సింగరేణిలో పనిచేసే దాదాపు 43 వేల మందకి ఈ బోనస్ వర్తించనుంది. ఈ నిర్ణయంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.