Tag Archives: degree

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 6,506 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 6,506 ఉద్యోగాలలో గ్రూప్-బి గెజిటెడ్ పోస్టులు 250 ఉండగా గ్రూప్-బి నాన్-గెజిటెడ్ ఉద్యోగాలు 3,513 గ్రూప్-సి ఉద్యోగాలు 2,743 ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వయస్సు లోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో స్టాఫ్ సెలక్షన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలకు పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. సీబీఐ, రైల్వే, పోస్టల్, ఇన్ కమ్ టాక్స్, ఇంటలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ సెక్రటేరియట్ ఇతర ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 31 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉండదు. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.