Tag Archives: Kalingapatnam

తీరం దాటిన గులాబ్.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న అధికారులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ గుబులు పట్టుకుంది. ప్రస్తుతం ఈ తుఫాను సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మధ్య తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షం కురవగా.. శ్రీకాకుళం నగరంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. అన్ని శాఖలు తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాయి.

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వాధికారులు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోమవారం మధ్యాహ్నం వరకు కోస్తా తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరాంధ్ర తీరం వెంబడి సముద్రంలో అలజడి ఉధృతంగా ఉంటుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో మరో 24 గంటల వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. ప్రస్తుతం ఈ భారీ వర్షాల కారణంగా ఉత్తరాంధ్రలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. రానున్న ఆరు గంటల్లో తుఫాన్ బలహీన పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.

తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లకు అడ్డంగా చెట్లు పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా పోలీసు యంత్రాగం సహాయ చర్యలు చేపట్టారు. విద్యుత్ లేకపోవడంతో మినీ ల్యాంప్స్, సెల్ ఫోన్ వెలుగులోనే విరిగిన చెట్లను తొలగిస్తున్నారు.