Tag Archives: no beds

బ్లాక్ ఫంగస్ రోగులకు బెడ్స్ లేవు.. వైద్యం చెయ్యం!

దేశవ్యాప్తంగా ఓవైపు కరోనా ప్రళయం సృష్టించగా, మరొకవైపు బ్లాక్ ఫంగస్ విలయతాండవం చేస్తుంది. ఈ క్రమంలోనే రోజురోజుకు బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరగడంతో నోడల్ కేంద్రమైన కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో 200 పడకలు కేటాయించారు. మరికొన్ని అదనపు పడకలు వేయడంతో ఇప్పటికే 218 మంది ఇందులో చేరారు. సోమవారం ఒక్కరోజు మాత్రమే అత్యవసర చికిత్సా విభాగంలో 31 మందిని ఆస్పత్రిలో చేర్చుకున్నట్లు వైద్య అధికారులు తెలియజేశారు.

బ్లాక్ ఫంగస్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఆస్పత్రిలో పడకలు లేక ఎంతో మంది వెను తిరుగుతున్నారు. మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరడంతో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.

బ్లాక్ ఫంగస్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగించే లైపోసోమల్‌ యాంఫోటెరిసిన్‌-బి, ఫొసకానజోల్‌, డీఆక్సీ కొలైట్‌ తదితర ఇంజక్షన్లకు కొరత నెలకొంటోంది. అదేవిధంగా ఆస్పత్రిలో పడగల సౌకర్యం లేకపోవడంతో ఎంతో మందికి మందులు రాసిచ్చి ఇంటికి పంపుతున్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాపించడంతో నగర శివారు ప్రాంతాల్లోని ప్రజలు చికిత్సకోసం నగరానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో పడకలకు ఇబ్బంది తప్పడం లేదు. 

ఈ విధంగా బ్లాక్ ఫంగస్ కేసులు అధికమవుతున్న తరుణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర వైద్య కళాశాల్లోని అనుబంధ ఈఎన్‌టీ విభాగాల్లో బాధితులకు వైద్యం అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంపై అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు మొదట్లోనే గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తలెత్తదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.