Tag Archives: platform tickets

రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఆ ఛార్జీలు రెట్టింపు..?

గత కొన్ని నెలల నుంచి రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు వరుస షాకులు ఇస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఛార్జీలను పెంచుతోంది. కరోనా వైరస్, లాక్ డౌన్ నిబంధనల వల్ల రైల్వే శాఖకు భారీగా ఆదాయం తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ఆదాయం పెంచుకోవడం కోసం ప్రయాణికులపై భారం మోపడానికి రైల్వే శాఖ సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఫ్లాట్ ఫామ్ టికెట్ ధరను రెట్టింపు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.

ప్రస్తుతం దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో 10 రూపాయలుగా ఉన్న ప్లాట్ ఫామ్ టికెట్ ధర ఏకంగా 20 రూపాయలకు పెరగనుంది. అయితే రైల్వే శాఖ మొదట ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించే రైళ్లలో మాత్రమే ప్లాట్ ఫామ్ టికెట్ రేట్లను పెంచనుంది. భవిష్యత్తులో ఇతర రైల్వే స్టేషన్లలో సైతం టికెట్ రేట్లు భారీగా పెరిగే అవకాశాలు ఐతే ఉన్నాయని తెలుస్తోంది. ప్లాట్ ఫామ్ టికెట్ ధరల పెంపుపై ప్రయాణికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఛార్జీలతో పాటు రైల్వే శాఖ భవిష్యత్తులో యూజర్ డెవలప్మెంట్ ఛార్జీలను కూడా వసూలు చేయనుందని తెలుస్తోంది. మొదట 121 రైల్వే స్టేషన్లలో యూజర్ డెవలప్మెంట్ ఛార్జీలను విధించనున్నారని ఆ రైల్వే స్టేషన్లలోనే ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయని సమాచారం. రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వినోద్ కుమార్ యాద్ రైల్వే చార్జీల గురించి మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం 7,000 రైల్వే స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.

వీటిలో 121 రైల్వే స్టేషన్లలో రీడెవలప్‌మెంట్ కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని.. మొదట 10 నుంచి 15 శాతం రైల్వే స్టేషన్లలో యూజర్ ఛార్జీలు అమలవుతాయని పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో రీడెవలప్మెంట్ కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని తెలిపారు. రెనోవేషన్, డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్ లను ప్రైవేట్ కంపెనీలకు రైల్వే శాఖ అప్పగించబోతుందని వెల్లడించారు.