Tag Archives: queue lines

ఏపీలో కేజీ మటన్ 200 రూపాయలు.. క్యూ లైన్లలో జనం.. చివరకు..?

ఈ మధ్య కాలంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో పలువురు వ్యాపారులు వినియోగదారులకు కళ్లు చెదిరే ఆఫర్లను ఇస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలోని జి.కొండూరులో ఒక మాంసం దుకాణం కేజీ వేట మాంసం 200 రూపాయలు మాత్రమేనని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆధార్ కార్డుతో జనం మాంసం కొనుగోలు చేయాలని సూచించింది. బహిరంగ మార్కెట్ ధరతో పోలిస్తే చాలా తక్కువ ధరకే అందిస్తూ ఉండటంతో దుకాణం ముందు జనం క్యూ కట్టారు.

వందల సంఖ్యలో ప్రజలు మాంసం కొనుగోలు చేశారు. అయితే 200 రూపాయలకు కిలో అమ్మిన వ్యాపారి మరుసటి రోజే ప్రజలకు భారీ షాక్ ఇచ్చాడు. ఒక్కరోజులోనే అమాంతం రేటు పెంచేశాడు. ఇతర వ్యాపారులు ఏ రేటుకు మటన్ ను విక్రయిస్తున్నారో అదే రేటుకు విక్రయించే ప్రయత్నం చేశాడు. దీంతో మాంసం వ్యాపారికి, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిన్న 200 రూపాయలకు మాంసం విక్రయించగా నేడు ఎందుకు సాధ్యం కాలేదని గ్రామస్తులు వ్యాపారిని ప్రశ్నించారు.

అయితే వ్యాపారి చచ్చిన గొర్రెలు కాబట్టే ముందురోజు 200 రూపాయలకే మాంసం అమ్మాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కరోజులోనే మాంసం వ్యాపారి ఏకంగా 400 రూపాయలు ధర పెంచడంతో అధికారులు మాంసం దుకాణాలపై దృష్టి పెట్టి మాంసం నాణ్యతను పరిశీలించాలని.. 200 రూపాయలకు అమ్మిన మటన్ విషయంలో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని వెల్లడిస్తున్నారు.

వ్యాపారులు లాభాపేక్షతో చచ్చిన జీవాలను, రోగాలతో చనిపోయినా జీవాలను తమకు అంటగడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే మాంసం అమ్మకాల విషయంలో పోటీ పెరిగిందని.. మటన్ తక్కువ ధరకు అమ్మడంలో తిరకాసు ఉందని తెలుపుతున్నారు.