Tag Archives: WiFi connection

ఆ ఎలుకలు చేసిన పనికి.. 2 వేల మంది ఇబ్బందికి గురయ్యారు.. ఎందుకంటే..?

కొంతమంది ఇళ్లల్లో ఎలుకలు ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. వాటి వల్ల ఇబ్బంది పడే వారు కొందరు ఉంటే.. వాటిని కొన్ని ప్రయోగాలకు ఉపయోగించే వారు కూడా ఉన్నారు. వైద్య రంగంలో వాటిపై ప్రయోగాలు చేస్తుంటారు. ఎలుకలకు తినే వస్తువు ఏదైనా కనిపిస్తే వాటిని వదిలిపెట్టవు.

తాజాగా ఇక్కడ ఆ ఎలుకలు చేసిన పనికి దాదాపు 2 వేల మంది ఇంటర్ నెట్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన ఇంగ్లాండ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్ లోని టోరిడ్జ్‌, డేవాన్‌ ప్రాంతాలలో ఎలుకల బెడద కాస్త ఎక్కువే అని చెప్పాలి. అక్కడ అవి ఇంటర్ నెట్ కేబుళ్లను కొరికి పడేశాయి.

ఎక్కడ ఆ వైర్లు తెగి పడ్డాయో తెలియకుండా చేసేశాయి. దీంతో ఆ ప్రాంతంలోని మొత్తం దాదాపు 2 వేల మంది వైఫై సేవలను వినియోగించుకోలేక పోయారు. ఇలా అక్కడ బీటీ, ప్లస్‌నెట్‌,స్కై, వొడాఫోన్‌ సేవలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దాదాపు ఏడు గంటల పాటు ఇలా వైఫై సేవలకు అంతరాయం కలిగింది.

దీనిపై స్థానికంగా ఓ ప్రభుత్వ అధికారి స్పందించారు. ఫిర్యాదు వచ్చిన దగ్గర నుంచి తమ ఇంజనీర్లు ఎక్కువగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. మునుపటి స్థితికి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపాడు.