1975లో తెలుగు చలనచిత్రసీమలో తిరుగులేని రికార్డులను సాధించిన ఆంధ్రా సోగ్గాడు !

0
332

అందాల నటుడు శోభన్ బాబు మరణించి 12 సంవత్సరాలవుతున్నా ఇప్పటికీ తెలుగు చలన చిత్రసీమ చరిత్రలో సోగ్గాడు గా ఆయన జ్ణాపకాలు అభిమానుల గుండెల్లో పదిలంగానే వున్నాయి.
“పోయినోళ్ళు ఉన్నోళ్ల తీపి గురుతులు” అన్నారు ఆచార్య ఆత్రేయ. నిజమే.! పోయినవాళ్ళంతా ఉన్నవాళ్ళ తీపి గురుతులే.

పన్నెండేళ్ళ క్రితం పరమపదించిన ఓ అభిమాన హీరోను గుర్తు పెట్టుకోవడం నిజంగా అపురూపమైన విషయమే. శోభన్ బాబు నిజంగా అదృష్టవంతుడు. తెలుగు సినీ రంగంలో “శోభా”యమానంగా వెలిగాడు. విలక్షణ నటుడుగా, అందాల హీరోగా శోభన్ బాబు తెలుగు ప్రేక్షకుల మనసులో చెరిగిపోని ముద్ర వేశాడు. జనవరి 14 1937లో కృష్ణా జిల్లా చిన్న నందిగామలో జన్మించిన శోభన్ బాబు 1959లో ఎన్టీఆర్ హీరోగా నటించిన “దైవ బలం” చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించాడు. కెరీర్ ఆరంభంలో ఎన్నో కస్టాలు పడ్డాడు. అనుభవం నేర్పిన గుణపాఠాలనూ నేర్చుకున్నాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా సినిమా రంగంలో విజేతగా నిలబడ్డాడు.

శోభన్ బాబు జైత్రయాత్ర 1975లో దిగ్విజయంగా కొనసాగింది. ఆ యేడాది శోభన్ బాబు నటించిన “దేవుడు చేసిన పెళ్ళి, బాబు, జీవనజ్యోతి, బలిపీఠం, జేబుదొంగ, సోగ్గాడు” వంటి సూపర్ హిట్ చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేసేశాయి. 1975 లో ఈ సినిమాలన్నీ 100 రోజులు ఆడాయి. ఈవిధంగా ఒక్క సంవత్సరంలోనే ఐదేసీ సినిమాలు 100 రోజుల ఆడినట్టు ఎన్టిఆర్, ఏఎన్ఆర్, కృష్ణలకు క్రెడిట్ ఉన్నప్పటికీ 3 చిత్రాలు మాత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ 100 రోజులు ఆడడం మన ఆంధ్రా సోగ్గాడు శోభన్ బాబు సాధించిన అరుదైన రికార్డ్. సినీ నిర్మాణానికి పుట్టినిల్లైన హైదరాబాద్ లో ఒక్క సంవత్సరంలోనే తను హీరోగా నటించిన 4 సినిమాలను డైరెక్ట్ గా 100 రోజులు ఆడించిన ఘనతను సాధించిన ఏకైక హీరో శోభన్ బాబు. అలాగే ఒకే ఏడాది రిలీజైన తన 8 చిత్రాలను 15 కేంద్రాలలో 100 రోజులు ఆడేలా చెయ్యడం మరో రికార్డ్ అని చెప్పవచ్చు. విడుదలైన ఒక ఏడాదిలోనే కోటి రూపాయలు వసూలు చేసిన 4వ తెలుగు చిత్రంగా ‘సోగ్గాడు’ ముూవీ ఆరోజుల్లో సంచలనం సృష్టించింది. 56 రోజుల పాటు ‘సోగ్గాడు’ చిత్రం విడుదలైన ధియేటర్స్ అన్నీ వరుసగా పుల్ అయిన తొలి తెలుగు చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 1975లో శోభన్ బాబు నటించిన 8 చిత్రాల్లో 6 చిత్రాలు టోటల్ గ్రాస్ 6 కోట్లకు పైనే అంటే ఆశ్చర్యం కలగకమానదు. అందుకే శోభన్ బాబు 1975ని తన కెరీర్లో మరపురాని సంవత్సరంగా క్రియేట్ చేసుకుని, ఇదే ఏడాది స్టార్ హీరో హోదాను కూడా అందుకున్నాడు.

1996లో ఆయన నటించిన “హలో గురు” శోభన్ బాబు నటించిన చివరి చిత్రమని చెప్పాలి. ఎందుకంటే.. ఆ తర్వాత సినిమా రంగానికి దూరంగా వున్నాడు. శోభన్ బాబు స్వతహాగా మృదు స్వభావి. సంస్కారం వున్న హీరో. ఎవరినీ పరుషంగా మాట్లాడేవాడు కాదు. తను, తన సినిమాలు, తన కుటుంబం, తన ఆర్ధిక లావాదేవీలు తప్ప మరొక వ్యవహారంలో తల దూర్చేవాడు కాదు. ప్రతిరోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తూ తన గ్లామర్ ను కాపాడుకొనేవాడు. ఆ గ్లామర్ నే చివరి వరకు ప్రేక్షకుల మనస్సులో పదిలంగా నిలుపుకొని వుండాలని నిర్ణయించుకున్నాడు కానీ., వయసు పైబడటం వలన బట్టతల వచ్చింది. ఆ బట్టతలతో తన ఫ్యాన్స్ కు కనిపించకూడదని నిర్ణయించుకుని, సినిమాలలో నటించడం మానేశాడు. అంతే కాకుండా టాలీవుడ్ లో జరిగే పెళ్లిళ్లు, పేరంటాలు, సినిమా శత దినోత్సవాలు, సన్మానాలు, సత్కారాలు.. ఇలా ఏ ఫంక్షన్లకూ పిలిచినా వెళ్లకుండా ఇంట్లోనే వుండి పోయాడంటే కారణం తన అందాల రూపం ప్రేక్షకుల మనసులో అలాగే ఉండిపోయాలని అనుకున్నాడు. బంధు, మిత్రుల నుంచి ఒత్తిడి వచ్చినా, ఫ్రెండ్స్ ఎంతో మంది ఎన్ని రకాలుగా చెప్పినా శోభన్ బాబు వినలేదు. తన ముసలి రూపం కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఆవిధంగా జీవితం గడుపుతున్న శోభన్ బాబు 20 మార్చి 2008న తన 71వ సంవత్సరంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అప్పటికి శోభన్ బాబు 230 సినిమాల్లో నటించాడు. 5 నంది అవార్డులు వచ్చాయి. 4 ఫిలిమ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here