YS Avinash Reddy : ఏపీలో మాజీ మంత్రి వివేకా హత్య కేసు చివరి దశకు వచ్చిందని చాలా కాలంగా చెప్పుకుంటున్నాం.. కానీ ఏంటో ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో కొలిక్కి వచ్చేదెప్పుడో తెలియట్లేదు. దీనికి తగ్గట్టే సుప్రీంకోర్టు సైతం డెడ్ లైన్స్ చేంజ్ చేస్తూ వెళుతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఆంజనేయుడి పెళ్లి ఎప్పుడంటే రేపు అన్నట్టుగా ఉందీ వ్యవహారం. ఈ కేసులో ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు బాగా వినిపించింది. అంతేకాకుండా ఆయనను ఇప్పటికే పలు మార్లు విచారించిన సీబీఐ అధికారులు తిరిగి నేడు విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఆయన కూడా నిన్ననే హైదరాబాద్‌కు బయలుదేరారని తెలిసింది. లాస్ట్ మినిట్‌లో ఒక ఫోన్ కాల్ రావడంతో ఆగిపోయారట. ఆ ఫోన్ కాల్ ఎవరిది? ఏం చెప్పారు? సీబీఐ అధికారులు పులివెందులకు ఎందుకు వచ్చారు? వంటి ఆసక్తికర అంశాలపై ప్రత్యేక కథనం..

ఉన్న ఫళంగా పులివెందులకు వెళ్లాలి..!
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణకు రావాలంటూ అవినాష్‌రెడ్డికి అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఇక నిన్న విచారణ అనంతరం అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక నిన్న ఉదయం పెద్ద హైడ్రామా నడిచింది. అవినాష్ రెడ్డి విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు సోమవారం రాత్రే వచ్చారు. మంగళవారం సీబీఐ కార్యాలయానికి బయలుదేరారు కూడా ఇంతలోనే బిగ్ ట్విస్ట్. ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చిందని.. ఆయనను ఉన్నఫళంగా పులివెందులకు వెళ్లాలని సదరు ఫోన్ చేసిన వ్యక్తి చెప్పారట. అంతే.. ఆయన వెంటనే పులివెందులకు వెళ్లారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఒకవేళ పులివెందులలో తనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తే రాజకీయంగా కావల్సినంత మైలేజ్ వస్తుందని ఆయన భావించారట. అయితే ఆయన కంటే ముందుగానే పులివెందులకు చేరుకున్న సీబీఐ అధికారులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

ట్విస్టులతో కూడిన హైడ్రామా..!
సీబీఐ విచారణకు బయలుదేరిన అవినాష్ రెడ్డి.. ఒక్క ఫోన్ కాల్‌తో ఆగిపోయారు. ఇంతకీ ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనేది? ఆసక్తికరంగా మారింది. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అని కొందరు.. కాదు ఆయన సతీమణి భారతీ రెడ్డి అని కొందరు చెప్పుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఇదొక హాట్ టాపిక్ అయిపోయింది. అసలు ఈ ఫోన్ కాల్‌కు ముందు పెద్ద హైడ్రామా నడిచింది. నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాల్సిందేనని సీబీఐ అధికారులు పట్టుబట్టారు. రాలేనని.. నాలుగు రోజుల పాటు గడువు కావాలని అవినాష్ రెడ్డి కుదరదన్న అధికారులు మొత్తంగా నిన్నంతా ట్విస్టులతో కూడిన హైడ్రామా నడిచింది. ఈ హైడ్రామాకు ఫుల్ స్టాప్ పడకముందే అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు. ఇంతకీ తనను అరెస్ట్ చేసేందుకే సీబీఐ అధికారులు పులివెందులకు వస్తున్నారని అవినాష్ రెడ్డి భావిస్తే.. వారు మాత్రం షాక్ ఇచ్చారు.

అవినాష్ రెడ్డి కంటే ముందుగానే..!
ఫోన్ చేసింది ఎవరన్న విషయంపై స్పష్టత రాలేదు కానీ విచారణకు వెళ్లొద్దని అవినాష్‌రెడ్డికి సూచనలు మాత్రం వచ్చాయని స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి ఫోన్ కాల్ ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి పులివెందులకు బయలుదేరారు. ఆయన కంటే ముందుగానే సీబీఐ బృందం అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకుంది. దీంతో అంతా షాక్ అయ్యారు. కానీ సీబీఐ అధికారులు మాత్రం కూల్‌గా వైఎస్ భాస్కర్ రెడ్డి కారు డ్రైవర్‌కు నోటీసులిచ్చి వెళ్లపోయారు. మొత్తానికి అవినాష్ రెడ్డి విచారణలో ట్విస్టులే ట్విస్టులే. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. నిన్న అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారని చాలా మంది బెట్టింగుల మీద బెట్టింగులకు దిగారు. వీరికి కూడా ఇది బిగ్ ట్విస్టే.