అమ్మాయిలకు సంవత్సరానికి రూ.50000 స్కాలర్ షిప్.. ఎలా పొందాలంటే..?

దేశంలో చాలామంది బాలికలు ప్రతిభ, పట్టుదల ఉన్నా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల చదువుకు దూరమవుతున్నారు. ప్రతి సంవత్సరం ఇలా చదువుకు దూరమవుతున్న బాలికల సంఖ్య లక్షల్లో ఉంది. అయితే ఆర్థికంగా ఎవరైనా సహాయం చేస్తే మాత్రం ఈ బాలికలు అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు సత్తా చాటగలరు. ఇలా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల చదువుకు దూరమవుతున్న వాళ్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శుభవార్త చెప్పింది.

ప్రగతి స్కాలర్‌షిప్ పేరుతో ప్రతి సంవత్సరం 10,000 మంది విద్యార్థినులు డిప్లొమా, ఇంజినీరింగ్ చదివే విద్యార్థినులకు స్కాలర్ షిప్ అందిస్తోంది. ఆర్థికపరమైన ఆసరా అందిస్తూ విద్యార్థినులను సాంకేతికంగా ముందడుగులు వేసేలా చేస్తోంది. ఈ స్కాలర్ షిప్ కు విద్యార్థినులు ఎంపికైతే డిప్లొమా చదివే వాళ్లు మూడు సంవత్సరాలు, ఇంజినీరింగ్‌ కోర్సులు చదివే వాళ్లు నాలుగు సంవత్సరాలు స్కాలర్ షిప్ ను పొందే అవకాశం ఉంటుంది.

లేటరల్‌ ఎంట్రీ అయితే ఇంజనీరింగ్ విద్యార్థినులు మూడేళ్లు, డిప్లొమా విద్యార్థినులు అయితే రెండేళ్లు స్కాలర్ షిప్ ను పొందే అవకాశాలు ఉంటాయి. ఫీజు, వసతి, పుస్తకాలు, కంప్యూటర్, ఇతర ఖర్చుల కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. చదువులో విద్యార్థినులు చూపిన ప్రతిభ కారణంగా విద్యార్థినులకు ఈ స్కాలర్ షిప్ కొనసాగడం లేదా ఆగిపోవడం జరుగుతుంది.

డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ ఫస్టియర్‌ విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువగా ఉండే ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిప్లొమా లేదా బీటెక్‌ చదివే విద్యార్థినులు స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో 884 మంది డిప్లొమా, ఇంజనీరింగ్ విద్యార్థినులు, తెలంగాణలో 630 మంది విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కు ఎంపికవుతారు. https://scholarships.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 31వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.