జుట్టుకు రంగు వేస్తున్నారా.. అయితే జాగ్రత్త..!

సాధారణంగా ప్రస్తుతం కాలానికి అనుగుణంగా జరుగుతున్న మార్పులలో భాగంగానే అతి చిన్న వయసులోనే పిల్లలకు జుట్టు తెల్లబడటం మనం చూస్తుంటాం. అయితే జుట్టు తెల్లగా ఉండటం వల్ల పెద్దవారిగా కనిపిస్తున్నామనే భావన అందరిలో కలగడం సర్వ సాధారణమే. అలా తెల్ల జుట్టు కనిపించకుండా ప్రతి ఒక్కరు జుట్టుకు రంగు వేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విధంగా తరుచూ జుట్టుకు రంగు వేసుకోవటం వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుందా? అంటే కచ్చితంగా ప్రమాదం అని చెప్పవచ్చు. జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా మనం జుట్టుకు వాడే రంగులు ఎన్నో రకాల కెమికల్స్ తో తయారై ఉంటాయి. అందులో ఉన్న కెమికల్స్ మన చర్మం పై పడినప్పుడు కొన్ని చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొందరిలో ఆ రంగులో ఉన్న రసాయనాలు వారి శరీర తత్వానికి సరిపోకపోవడం వల్ల జుట్టు రాలే సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జుట్టుకు రంగు వేసుకునే సమయంలో కళ్ళల్లో పడకుండా జాగ్రత్త పడాలి.

హెయిర్ డైలో కోల్ తార్, పీపీడీ వంటి రసాయనాలు ఉండటం వల్ల అవి కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీసే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే పూర్తిగా రసాయనాలతో తయారైన రంగులను వాడకుండా హెర్బల్ పద్ధతిలో నేచురల్ గా దొరికే మెహందీ, హెన్న జుట్టుకు వాడటం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అయితే జుట్టుకు రంగు వేసుకునే ముందు దానిని చెవి వెనుక భాగంలో వేసుకొని రెండు రోజులపాటు ఆగాలి. రెండు రోజుల వరకు మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే ఆ రంగును మన జుట్టుకు వేసుకోవడం మంచిది. జుట్టుకు రంగు వేసుకునే సమయంలో కచ్చితంగా చేతికి గ్లౌజులు ధరించాలి. లేకపోతే ఆ రంగు మన చేతికి అంటుకోవడం ద్వారా చర్మ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. గర్భిణి స్త్రీలు, బాలింతలు వీలైనంత వరకూ జుట్టుకు రంగులు వేయకుండా ఉండడం ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.