మాస్క్ ఇలా వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం నుంచి కనిపించని ఒక చిన్న సూక్ష్మ జీవితో యావత్ ప్రపంచం మొత్తం తీవ్ర పోరాటం చేస్తోంది. వివిధ రకాల వేరియంట్లలో ఉత్పరివర్తనం చెందుతూ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మహమ్మారిని కట్టడి చేయాలంటే కేవలం మన ముందున్న ఏకైక అస్త్రం మాస్క్, వ్యాక్సిన్ వేయించుకోవడం.ఇంత జనాభా కలిగిన మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందాలంటే చాలా సమయం పడుతుంది కనుక ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా బయట పడాలంటే తప్పనిసరిగా మాస్కు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ క్రమంలోనే గత నెలలో చేసిన ఓ సర్వే ప్రకారం చాలా మంది మాస్కులు వేసుకున్నప్పటికీ వాటిని సరైన క్రమంలో ధరించకపోవడం వల్ల ప్రమాదం బారిన పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కరోనాను కట్టడి చేయడం కోసం వివిధ రకాల మాస్కులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. క్లాత్ మాస్క్ లను వాడటం వల్ల మనకు వైరస్ నుంచి 65 శాతం రక్షణ ఉంటుంది. అదేవిధంగా సర్జికల్ మాస్ వాడటం ద్వారా 75 శాతం రక్షణ పొందవచ్చు. ఇకపోతే ఎన్-95 మాస్క్ వాడటం వల్ల ఈ వైరస్ నుంచి 95 శాతం వరకు రక్షణ పొందవచ్చు.

ఈ కరోనా వైరస్ నుంచి 100% మనకు రక్షణ కలగాలంటే తప్పనిసరిగా డబల్ మాస్క్ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ వేరియంట్ ఎంతో ప్రమాదకరమైనది కావడం చేత ప్రతి ఒక్కరు డబల్ మాస్కు ధరించాలని, ఈ విధంగా ఒక సర్జికల్ మాస్క్ ఒక క్లాత్ మాస్క్ ధరించినప్పుడే వైరస్ నుంచి 100 శాతం రక్షణ పొందగలమని తెలిపారు.

మాస్కులు ధరించే సమయంలో ప్రతి ఒక్కరు సురక్షితమైన మాస్క్ లను ఉపయోగించాలి. వాడినది ఏ మాత్రం ఉతకకుండా తిరిగి వాడటం, బాగా మురికిగా ఉన్న మాస్క్ లను పదే పదే వాడటం వల్ల మరింత ప్రమాదానికి గురి కావాల్సి వస్తుంది కనుక క్లాత్ మాస్క్ లను వాడేవారు తప్పనిసరిగా ప్రతిసారి ఉతికి శుభ్రం చేసిన తర్వాత ఉపయోగించాలి. ఇక సర్జికల్ మాస్క్ కేవలం ఒక్కసారి మాత్రమే అంటే 12 గంటల వరకు ఉపయోగించవచ్చు.ఎన్-95 మాస్క్ ను ఎలాంటి పరిస్థితులలో ఉతకకూడదు. ఈ మాస్క్ ఉతకడం వల్ల ఫిల్టర్ సామర్థ్యాన్ని కోల్పోతుంది కనుక దీనిని కాకుండా ఎండలో వేసి ఐదు సార్లు వరకు ఉపయోగించవచ్చు.

మాస్కులు ధరించేవారు ఏకంగా మాస్క్ ను చేతితో తాకకుండా,మాస్క్‌ని దానిలో ఇన్నర్‌ లూపులు, స్ట్రాప్‌లతో మాత్రమే హ్యాండిల్‌ చేయాలి. మాస్క్‌ మీ ముక్కు నోరు గడ్డం పూర్తిగా కప్పి ఉంచేలా ఉండాలి. అవసరం అనుకుంటే మాస్క్ స్ట్రాప్ లను ముడివేసే అయినా మనకు రక్షణగా ఉండేలా వేసుకోవాలి. మాస్క్ ధరించిన తర్వాత ఒకవేళ తీయాల్సిన పరిస్థితి వస్తే మాస్క్ ను తాకకుండా చెవి లూప్ పట్టుకొని తొలగించాలి.ఈ విధంగా తీసిన మాస్క్ ను శుభ్రమైన ప్రదేశంలో పెట్టడం వల్ల తిరిగి దీనిని ధరించే అవకాశం ఉంటుంది. ఇక ఉపయోగించిన మాస్క్ లను ఎక్కడపడితే అక్కడ వేయకుండా అన్ని ఒక బిన్ లో వేసి ఒక చోట కాల్చి చేయాలి. ఈ విధంగా సరైన క్రమంలో మాస్క్ ధరించడం వల్ల ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉంటారని హైదరాబాద్ సీసీఎంబీ వీడియో రూపంలో తెలియజేశారు.