నమ్మించి ATM కార్డు మార్చిన కేటుగాడు.. డబ్బులన్నీ మాయం..

ఓ వ్యక్తి ఏటీఎం కార్డును మార్చి గుర్తుతెలియని వ్యక్తి రూ.24వేలను కొట్టేసాడు ఒక కేటుగాడు. బాధితుడు వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా, కేసముద్రం విలేజ్‌ లో నివశిస్తున్న బొల్లోజు జనార్దనాచారి శనివారం మండల కేంద్రంలోని ఏటీఎంలో తన డబ్బును డ్రా చేసుకోవడానికి వెళ్ళాడు. అయితే అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి మాస్క్‌ పెట్టుకుని లోపలికి వచ్చాడు. డబ్బులు రావడం లేదంటూ జనార్దనాచారి అతనిని హెల్ప్ అడగటంతో ఏటీఎం కార్డు ను తీసుకుని పిన్‌ నంబర్‌ను తెలుసుకున్నాడు. డబ్బు వస్తున్నట్టు ప్రయత్నం చేసాడు అయితే డబ్బు రాలేదు.

ఇక తన కార్డు తనకు ఇవ్వమని జనార్దనాచారి అడిగితే జనర్ధనాచారి కార్డుకు బదులుగా అతని వద్దనున్న మరో కార్డు ఇచ్చేసి వెళ్లిపోయాడు. జనార్ధనాచారి తనకార్డే అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తీరా ఇంటికి వెళ్లాక సెల్‌ఫోన్‌కు డబ్బు డ్రా చేస్తున్నట్టు మెసేజ్‌లు వస్తుండటంతో, కార్డు మారినట్లు గుర్తించాడు. అయితే అప్పటికే అతని కార్డ్ నుండి రూ.24వేలు డ్రా చేసాడు ఆ ఆగంతకుడు. దీంతో ఏటీఎం కార్డును బ్లాక్‌ చేయించి బ్యాంకు అధికారులతో పాటు సోమవారం కేసముద్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.