కమెడియన్ విజయ్ సాయి మృతికి కారణం అదే.. అలా చేస్తాడని ఊహించలేదు : అవసరాల శ్రీనివాస్

మొదట అష్టాచెమ్మా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు అవసరాల శ్రీనివాస్. అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ ను వదిలి పెట్టి.. సినిమాలపై ఆసక్తి కారణంగా ఇండస్ట్రీపై అడుగుపెట్టారు అతడు. తర్వాత అతడు హీరోగా, నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఇలా మల్టీ టాలెంట్‌తో ఆకట్టుకుంటున్నాడు.

ఆ తర్వాత ఉహలుగుసగుసలాడే, అమీతుమీ వంటి సినిమాల్లో నటించి ప్రతీ పాత్రలో నటించే టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు. తాజాగా అతడు ‘నూటొక్క జిల్లాలో అందగాడు’ సినిమా ఈ నెల 3 థియేటర్లలో విడుదల అయి మంచి టాక్ తెచ్చుకుంది. రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మిచారు.

ఇదిలా ఉండగా.. అతడు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు స్టార్ బిరుదులు, అవార్డులు నచ్చవంటూ చెప్పుకొచ్చాడు. అయితే విజయ్ సాయి.. తెలుగులో ఎన్నో కామెడీ పాత్రల్లో నటించాడు. తన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో 2017 డిసెంబరు 11 సోమవారం రోజున తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే శ్రీనివాస్.. విజయ్ సాయి గురించి మాట్లాడుతూ.. అతడికి ఆర్థిక పరంగా ఏవో కారణాలు ఉండటం కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. అతను అలా చేస్తాడని అస్సలు ఊహించలేదని.. ఆ ఘటనతో తాను చాలా నేర్చుకున్నానని.. సినీ రంగంలో కొంతమంది పైకి కనిపించేంత జాలీగా, ఆనందంగా ఎవరూ ఉండరని.. దాని వెనకాల ఎంతో శ్రమదాగి ఉంటుందని చెప్పుకొచ్చాడు.