జగన్ పిల్లోడే కానీ నెంబర్ వన్ సీఎం.. బాబుమోహన్ సంచలన వ్యాఖ్యలు..?

ప్రముఖ కమెడియన్, బీజేపీ నాయకుడు బాబు మోహన్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే సీఎం జగన్ నంబర్ 1 సీఎం అని అన్నారు. ఒకవైపు జగన్ ను ప్రశంసలతో ముంచెత్తిన బాబు మోహన్ మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాత్రం విమర్శలు చేశారు. సీఎం జగన్ మొదటి స్థానంలో ఉంటే కేసీఆర్ చివరి స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. జగన్ ఏపీ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్నాడంటూ బాబు మోహన్ కొనియాడారు.

గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి పెన్షన్ పంపిణీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ జరిగేలా చేశారని అన్నారు. కరోనా సమయంలో ప్రత్యేక వాహనాల సహాయంతో ప్రతి ఊరిలో ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకునేలా చేశారని.. రాజకీయ అనుభవం లేని జగన్ అద్భుతంగా పాలన సాగించాడని అన్నారు.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం కరోనా సమయంలో అస్సలు పట్టించుకోలేదని వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం జగన్ ను మెచ్చుకున్నారని.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే జగన్ అద్భుతంగా పని చేయడంతో ఆయనకు నంబర్ 1 ర్యాంక్ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ ప్రధానిని మారుస్తానని చెబుతూ ఉంటారని.. రేపటి ఎన్నికల్లో ఎవరు ఎవరిని మారుస్తారో తెలుస్తుందని అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్లని చెప్పారని కేసీఆర్ కు మాత్రం ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్లు మాత్రమే దేవుళ్లు అని అన్నారు. దళితులంటే కేసీఆర్ లెక్క ఉండదని.. పేదోళ్లంటే కేసీఆర్ కు అడ్రస్ ఉండదంటూ బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.