Category Archives: Spiritual Mysteries

Spiritual Mysteries

లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే.?!

ప్రతి రోజు చేసే నిత్య పూజలో లక్ష్మీ దేవి ఫొటో కానీ విగ్రహం కానీ.. పసుపు కుంకుమా, పువ్వులు తో అలంకారం చేసి.. ధనప్రాప్తి కలిగించమని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని.ఈ పూజ చేయాలి.

పూజ విధానం

108 ఒక్కరూపాయి బిల్లలు తీసుకుని లక్ష్మీ అష్టోత్తరం తో ఒక్కో నామం చదువుతూ.. ఒక్కో రూపాయి బిళ్ళ అమ్మవారి ఫోటో ముందు అర్చన చేస్తూ పెట్టాలి. హారతి ఇవ్వాలి రోజూ మీరు ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదు కానీ శుక్రవారం మటుకు బెల్లం అన్నం నివేదన చేస్తూ ఉండాలి. ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే మీరు అపర కోటీశ్వరులు అయిపోతారు అని నేను చెప్పను కానీ.. మీకు కనీస అవసరాలకు ఎప్పుడూ లోటు ఉండదు అప్పు చేసే అవసరం రాదు, అప్పు ఉన్న కొద్ది కొద్దిగా తీరుతూ ఉంటుంది… ఈ పూజకు ఆహార నియమాలు, ఇంక ఏమైనా నియమాలు అంటూ లేదు కానీ లక్ష్మీ దేవి శుభ్రంగా ఉన్న ఇంటిలోనే నిలుస్తుంది. దుమ్ము ధూళి ఉన్న ప్రాంతంలో ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు. రోజూ ఈ కాసులు పూజ ఐయాక కూడా అక్కడే ఉంచాలి రోజూ అవే వాడాలి. ఈ పూజకు వాడిన రూపాయి కాసులు ఎవరికి ఇవ్వకూడదు. ఖర్చు పెట్టకూడదు. పూజ 41 రోజు మొక్కుకొని చేయవచ్చు. తర్వాత కూడా ఎన్ని రోజులైనా చేయవచ్చు.

ఈ పూజ ఇదే విధంగా తామర గింజలతో, పసుపు కొమ్ములతో కూడా చేయవచ్చు. స్తోమత ఉన్నవారు. 108 వెండి కానీ బంగారు పుష్పాలతో అష్టోత్తరం చదివి పూజ చేయవచ్చు. మంత్రం ఉపదేశం ఉన్నవారు లక్ష్మీ గాయత్రి, లక్ష్మీ మూల మంత్రం, కమలదేవి మంత్రంతో ఇదే విధంగా 108 సార్లు అర్చన చేసుకోవచ్చు. లక్ష్మీ దేవికి నేతితో దీపారాధన శ్రేష్టం, నువ్వులు నూనె, కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. నిమ్మపండు పులిహోర, పెసరపప్పు చేసుకోవచ్చు. సెనగలు ఇష్టమైన నైవేద్యం. లక్ష్మీ పూజకు, కుబేర పూజకు ధన ప్రాప్తి కోసం చేసే పూజలో సువాసన గల ఆగరబత్తి గాని సాంబ్రాణి కానీ సువాసన గల పుష్పాలు పూజ మందిరం సువాసనతో ఉండాలి పూజలో ఇది ముఖ్యమైన విషయం. రోజూ కుదరని వాళ్ళు ప్రతి గురువారం, శుక్రవారం అయినా చేసుకోవచ్చు. ఈ రూపాయి బిల్లలు బీరువాలో పెట్టుకోవచ్చు లేదా నిత్యం పూజ గదిలో అమ్మవారి ఫోటో ముందు ఉంచడం మంచిది.

శ్రీకృష్ణుని మరణ రహస్యం !!

ఎక్కడో ద్వారక. దానికి చాలా దూరంలో తపోవనం. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు.
అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం వదిలాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ అందుబాటులో బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు.

ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్తను నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం వరకూ ప్రయాణమై వచ్చాడు. తపోవనమంతా వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. అలా వెతగ్గా.. వెతగ్గా మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు. కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలి పోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు. అర్జునుడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా ఇద్దరు, ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు. అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల తన దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి. ఇక ఆ మృత దేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక (ఎందుకంటే ద్వారక సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది), అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా. అంత్యక్రియలు పూర్తిచేసేసాడు.

అష్టభార్యలు, 80 మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావైన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు. అంతటి ఇతిహాస పురుషులకే అటువంటి అంతిమ ఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. మనమంతా కూడా కాల గమనంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు ఎవరికి ఎలా ఏ శిక్ష నిర్ణయిస్తుందో ఎవరూ చెప్పలేరు.
ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మరణాలు పొందినవారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణుడి అంత్యక్రియల ఘట్టం కొంతైనా భారాన్ని దింపుకునే శక్తిని ప్రసాదిస్తుందని ఆశిద్దాం.
సర్వే జనా సుఖినోభవంతు