CM KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తున్న కేసీఆర్ కామెంట్స్.. ఇంతకీ దళితబంధు రాబందులెవరు..!?

CM KCR : సీఎం కేసీఆర్.. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్‌లో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఏం మీ ఇంటి సొమ్ము అనుకున్నారా? సర్కార్ ఇచ్చే దళిత బంధు పథకానికి మూడు లక్షల కమీషన్ అడుగుతున్నారట.. ఏంటి కథ? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో సైతం ఇంతకీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు కొందరు నేతలకు దడ పుడుతోంది. అసలు కేసీఆర్ ఏమన్నారు? ఆ వ్యాఖ్యలు రాష్ట్రంలో ఎందుకు సంచలనంగా మారాయి? కొందరు నేతలకు ఎందుకు దడపుడుతోంది? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇంతకీ దళితబంధు రాబందులెవరు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

దళిత బంధు రాబందుల లిస్ట్ ఇదేనంటూ పోస్టులు..!
‘‘దళిత బంధు స్కీమ్‌లో వసూళ్లకు పాల్పడ్డ ఎమ్మెలేలకు ఇదే నా చివరి వార్నింగ్. కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకూ వసూల్ చేశారు. ఆ ఎమ్మెల్యేల చిట్టా అంతా నా దగ్గర ఉంది. మళ్లీ వసూళ్లకు పాల్పడితే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదు. దానితో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. మీ అనుచరులు దళిత బంధు స్కీ్మ్ తీసుకున్నా మీదే బాధ్యత’’ కేసీఆర్ వసూళ్ల చిట్టా తన దగ్గర ఉందని చెప్పడంతో దళిత బంధు స్కీమ్‌లో వసూళ్లకు పాల్పడ్డ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. అని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్‌లో ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇది తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో దళిత బంధు రాబందుల లిస్ట్ ఇదేనంటూ పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఇక పలు జిల్లాల్లో దళిత బంధు రాబందుల పేర్లతో సహా లిస్ట్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఆయా నేతలంతా ఎమ్మెల్యేలంతా తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురవుతున్నారట. ఇప్పటికే పలువురు స్థానిక నేతలు దళితబంధు వసూళ్ల గురించి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అది చాలదన్నట్టు ఏకంగా సీఎం కేసీఆరే వ్యాఖ్యలు చేయడంతో దళితబంధు రాబందులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

రోడ్డెక్కి మరీ దళితుల నిరసన..
అయితే ఈ వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రెండు నియోజకవర్గాల నాయకులను ఉద్దేశించి కేసీఆర్ అన్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జిల్లాలోని ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల నేతలకు సీఎం ఆ వార్నింగ్‌ ఇచ్చారని టాక్ నడుస్తోంది. ముథోల్, బోథ్, ఖానాపూర్‌లో కమీషన్ల వ్యవహారాలు ఎమ్మెల్యేలకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయట. బోథ్‌లో కమీషన్లతో ఖరీదైన వాహనాలు కూడా కొనుక్కున్నారంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలతో కొందరు నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. ఇక ముథోల్‌లో అయితే ఏకంగా ఎమ్మెల్యే అనుచరుల తీరుపై ఆమధ్య రోడ్డెక్కి మరీ దళితులు నిరసన తెలిపారు. ఒకటి రెండు చోట్ల ఎమ్మెల్యేను సైతం నిలదీశారు. ఇవన్నీ ఒక్కఎత్తైతే ఇప్పుడు సీఎం వ్యాఖ్యలు తీవ్ర చర్చకు వస్తున్నాయట. సీఎం దగ్గరున్న చిట్టాలో తమ పేర్లు ఉన్నాయో, లేదోనని తెలుసుకునే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారని కొందరు అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

సీఎం లిస్ట్‌ను ముందు పెట్టి మరీ..
ఆసక్తికర విషయం ఏంటంటే.. దళిత బంధు పథకం విషయంలో లబ్ధిదారులకు నేతలు రూల్స్ పెడుతున్నారట. దీని ప్రకారం.. లబ్ధిదారులు అడ్వాన్స్‌గా కొంత.. పథకం వచ్చాక మిగతాది ఇవ్వాలంటూ రూల్ పెట్టారట. మొత్తమ్మీద ఈ పథకం కింద రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారట. ఇక కొన్ని నియోజకవర్గాల్లో అయితే చోటా మోటా నేతలు వసూలు చేస్తే విషయం లీక్ అవుతుందని ఏకంగా ఒక టీంను ఏర్పాటు చేసుకుని మరీ దందాను నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సర్వే నేపథ్యంలో ఈ విషయాలన్నీ సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లాయట. అందుకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఇంకా కొనసాగిస్తే మాత్రం ఈసారి సీఎం లిస్ట్‌ను ముందు పెట్టి మరీ వాయిస్తారని ఎమ్మెల్యేలు భయపడుతున్నారట. దీంతో తమ అనుచరులకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారట. అసలే ఎన్నికల టైం.. అటు ఇటు అయితే టికెట్ కూడా రాదు.. కాబట్టి ఇక మీదట కమీషన్లు, దందాలు ఆపండి అంటూ కొందరు ఎమ్మెల్యులు అనుచరులకు గట్టిగానే చెబుతున్నారని టాక్. మరికొందరైతే అనుచరులకు పిలిచి క్లాస్ పీకుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక కొందరైతే తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలని భావిస్తున్నట్టు టాక్. మొత్తమ్మీద కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ దళితబంధు రాబందులకు దడ పుట్టిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.