తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు.. ఐదేళ్ల కూతురుతో అంత్యక్రియలు.. కంటతడి పెట్టించిన దృశ్యాలు..

భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను పోలీస్ స్టేషన్ కు పిలిపించి అవమానించాడన్న ఒక్క కారణంతో తన తండ్రికి తలకొరివి పెట్టనని మొండికేశాడు ఓ కొడుకు. దీంతో చేసేది లేక తన పదేళ్ల కూతురుతోనే అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించారు. చెడు మార్గాల్లో పయనిస్తున్న పదహారేళ్ల కొడుకుని సక్రమ మార్గంలో పెట్టేందుకు తండ్రి పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పించాడు. ఆయన చేసింది తన భవిష్యత్ కోసమేనని తెలుసుకోలేని ఆ కుర్రాడు కన్నతండ్రి పైన కక్ష పెంచుకున్నాడు.

తండ్రి మరణిస్తే కనీసం తలకొరివి పెట్టడానికి కూడా ముందుకు రాలేదు. దీంతో కూతురే అంత్యక్రియలు నిర్వహించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అశ్వారావుపేటకు చెందిన లింగిశెట్టి నీలాచలం(38) స్థానికంగా సెలూన్‌ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక అప్పుల పాలయ్యాడు. తెచ్చిన అప్పులు పెరిగి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి నెలకొంది.

దీంతో తీర్చే మార్గం లేక ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 16 ఏళ్ల కొడుకు చేత తలకొరివి పెట్టించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తుండగా తాను పెట్టనని మొండికేశాడు. గతంలో జులాయిగా తిరుగుతున్నాననే నెపంతో తండ్రి తనకు పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పించి పరువు తీశాడని, అందుకే ఆయనకు తలకొరివి పెట్టనని తెగేసి చెప్పాడు.

ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో బంధువులు, పెద్దలు చర్చించుకుని కూతురు మీనాక్షితో నీలాచలానికి అంత్యక్రియలు చేయించారు. ఇక్కడ ఐదు సంవత్సరాల కూతురు తలకొరివి పెట్టే దృశ్యాలు ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించాయి.