Pawan Kalyan: జీతం తీసుకోకుండా పనిచేస్తాను.. సంచలన నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో భారీ విజయం సాధించిన తర్వాత ఈయన ఎమ్మెల్యేగా మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తానని తెలిపారు. అంతేకాకుండా తాను అందరిలాగా రూపాయి జీతం తీసుకుంటానని చెప్పనని పూర్తిస్థాయిలో జీతం తీసుకుంటానని తెలిపారు.

ఇలా ప్రజల నుంచి జీతం తీసుకున్నప్పుడే నాకు మరింత బాధ్యత పెరుగుతుందని గతంలో చెప్పిన పవన్ కళ్యాణ్ తాజాగా తాను జీతం తీసుకోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో ఈయన మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ శాఖలో ఉన్న అప్పులు చూసి తాను షాక్ అయ్యానని తెలిపారు. ఇలా అప్పులల్లో ఉన్న ఈ శాఖ నుంచి తాను జీతం ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియడం లేదని అందుకే తనకు జీతం వద్దని తెలిపారు. అలాగే క్యాంప్ ఆఫీస్ లో మరమ్మత్తులు ఏవైనా చేయాలా అని అడిగితే అవి కూడా వద్దని చెప్పానని కొత్త ఫర్నిచర్ కూడా కొనద్దని వాటన్నింటినీ నేనే తెచ్చుకుంటానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

వేలకోట్ల అప్పులు..
ఈ విధంగా అప్పులు చేసి జీతం తీసుకోనని ఈయన చెప్పడంతో కొందరు ఈయనపై ప్రశంశలు కురిపించగా మరికొందరు మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు. జీతం తీసుకుంటే బాధ్యత ఉంటుందని చెప్పిన మీరు ఇప్పుడు జీతం తీసుకోనంటే ప్రజల పట్ల బాధ్యత లేనట్లే కదా అంటు కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ప్యాకేజ్ ఉండగా జీతం ఎందుకు దండగ అంటూ పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.