వీధివ్యాపారులకు కేంద్రం శుభవార్త.. రేపే రూ.10,000 పంపిణీ..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వీధివ్యాపారులకు శుభవార్త చెప్పింది. ఆత్మ నిర్భర భారత యోజన స్కీమ్ కింద వీధివ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. రేపటినుంచి కేంద్రం వీధివ్యాపారులకు 10,000 రూపాయల చొప్పున రుణాలను అందించనుంది. ప్రధాని మోదీ దాదాపు ముడు లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందిన వారితో మోదీ నేరుగా మాట్లాడనున్నారు

కరోనా వైరస్, లాక్ డౌన్ దేశంలోని వీధివ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి విదితమే. లాక్ డౌన్ వల్ల లక్షల సంఖలో వీధి వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. అన్ లాక్ సడలింపులు అమలు చేసిన సమయంలో సైతం వీధివ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చాలామంది వీధివ్యాపారులు దిక్కుతోచని పరిస్థితుల్లో అప్పులపై ఆధాపడ్డారు. కేంద్రం వీధి వ్యాపారుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన్‌ మంత్రి స్ట్రీట్ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి యోజన స్కీమ్ ను ప్రవేశపెట్టింది.

పీఎం నరేంద్ర మోదీ జూన్ నెల 1వ తేదీన ఈ స్కీమ్ ను ప్రకటించారు. కేంద్రం ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ రేటులో రూ.10,000 మూలధనాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ కొరకు 24 లక్షల మంది వీధివ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మందికి రుణాలు ఇవ్వనుందని తెలుస్తోంది.

5.35 లక్షల మందికి ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని.. మిగిలిన వీధివ్యాపారులకు రుణాలు మంజూరు చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే యూపీ నుంచి ఈ స్కీమ్ కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. 5,57,000 మంది ఉత్తరప్రదేశ్ వీధివ్యాపారులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. పీఎం తమకు ప్రయోజనం చేకూరేలా స్కీమ్ ను అమలు చేస్తూ ఉండటంపై వీధివ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.