ట్రూ కాలర్ యాప్ వాడేవాళ్లకు శుభవార్త..?

స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ మంది వినియోగదారులు వినియోగించే అప్లికేషన్లలో ట్రూ కాలర్ కూడా ఒకటి. ఈ యాప్ ద్వారా యాప్ వినియోగదారులకు అవతలి వైపు నుంచి కాల్ చేసే వాళ్ల వివరాలు సులభంగా తెలుస్తుంది. మనలో చాలామంది ప్రతిరోజూ స్పామ్ కాల్స్ వల్ల ఇబ్బందులు పడుతుంటారనే సంగతి తెలిసిందే. మార్కెటింగ్ కంపెనీల నుంచి రోజుకు పదుల సంఖ్యలో కంపెనీల నుంచి కాల్స్ వస్తుంటాయి.

అయితే ఈ కాల్స్ లో కొన్ని ముఖ్యమైన కాల్స్ ఉండగా చాలా కాల్స్ అనవసరమైనవే ఉంటాయి. కొన్ని నంబర్లను మనం బ్లాక్ చేసినా వేరే నంబర్ల నుంచి కాల్స్ వస్తూ ఉండటంతో ఇబ్బందులు పడుతూ ఉంటాం. తాజాగా ట్రూ కాలర్ యాప్ అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి అవతలి వ్యక్తులు మనకు కాల్ ఎందుకు చేస్తున్నారో తెలుసుకునే సాకర్యాన్ని ట్రూ కాలర్ యాప్ అందిస్తోంది.

ఉదాహరణకు బ్యాంకుల చెల్లింపులకు సంబంధించిన కాల్స్ వస్తే ఫోన్ స్క్రీన్ పైన కాలర్ ఐడీతో పాటు రీజన్ కూడా కనిపిస్తుంది. ఈ రీజన్ ఫీచర్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుందనే చెప్పాలి. రోజురోజుకు స్పామ్ కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ట్రూ కాలర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వినియోగదారుల సమయం కూడా ఆదా కానుంది. సెట్టింగ్స్ లో మార్పులు చేసుకుని ఈ ఫీచర్ ను వినియోగించుకోవాలో వద్దో యూజర్ డిసైడ్ చేసుకోవచ్చు.

ట్రూకాలర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొనిరాగా యాపిల్ ఫోన్ల యూజర్లకు త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మరికొన్ని కొత్త ఫీచర్లను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే దిశగా ట్రూ కాలర్ అడుగులు వేస్తుండటం గమనార్హం.