ఓటర్లకు అలర్ట్… ఓటర్ స్లిప్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..?

రేపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల వయస్సు దాటిన వారంతా ఓటర్ స్లిప్ తో పాటు ఓటర్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డు సహాయంతో ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలామంది ఓటర్ స్లిప్ లేకపోవడం వల్ల ఓటు హక్కును వినియోగించుకోలేమని కంగారు పడుతున్నారు. అయితే ఆన్ లైన్ లో సులభంగా ఓటర్ స్లిప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఓటర్ స్లిప్ ను డౌన్ లోడ్ చేసుకుని సమీపంలో ఉన్న పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వివరాలను కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఎన్నికల అధికారులు ఓటర్లు ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ సహాయంతో ఓటుహక్కును వినియోగించుకోవచ్చని సూచించారు. ఓటర్ స్లిప్ పొందాలనుకున్న వారు యాప్ లో ‘డౌన్‌లోడ్‌ యువర్‌ ఓటర్‌ స్లిప్‌’ ఆప్షన్ ను క్లిక్ చేసి పేరు, వార్డు నంబర్ నమోదు చేసి సులభంగా ఓటర్ స్లిప్ ను పొందవచ్చు.

అభ్యర్థులు సైతం ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తుండగా ఓటరు స్లిప్పులు అందకపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా అధికారులు ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌ ద్వారా పోలింగ్ బూత్ ను తెలుసుకునే అవకాశాన్ని సైతం కల్పించారు. ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, వార్డు పేర్లు ఎంటర్ చేసినా ఓటర్ స్లిప్ ను పొందవచ్చు. ఓటు వేయడానికి వెళ్లే వాళ్లు తమతో పాటు ఓటర్ కార్డ్ ను తీసుకెళ్లాలి.

ఓట‌రు గుర్తింపు కార్డు లేనివారు ఆధార్ కార్డు, పాస్‌ పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర గుర్తింపు కార్డులను తీసుకొని వెళ్లి ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులలో ఏ గుర్తింపు కార్డు ఉన్నా సులభంగా ఓటర్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.