‘నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో.. పాటలో కనిపించిన ఈ బాలుడు ప్రముఖ యాక్టర్ మరియు డాక్టర్ అని తెలుసా..?!

కేవలం బాక్సాఫీస్ ను దృష్టిలో పెట్టుకుని భారీ హంగులతో, భారీ తారాగణంతో మసాల చిత్రాలు వస్తున్నా ఆ రోజుల్లో కొత్త తారాగణంతో సందేశం ఇవ్వాలన్న సదుద్దేశంతో, ప్రామాణికతతో చిత్రాలు నిర్మించడం అనేదే సాహసోపేతమైన చర్య. అలాంటి సాహసానికి ఒడిగట్టినవారు మాదాల రంగారావు. విప్లవ కళాకారుడిగా నిరూపించుకున్న మాదాల రంగారావు ‘చైర్మన్ చలమయ్య’ చిత్రం తర్వాత అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారి పోవడంతో ఆయనే స్వయంగా నవతరం పిక్చర్స్ స్థాపించి ‘యువతరం కదిలింది’చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమా విజయవంతంతో ఆయన మరొక విప్లవాత్మక చిత్రం నిర్మించడానికి సిద్ధమయ్యారు. నవతరం పిక్చర్స్ కి నైతిక, ఆర్థిక బలాన్నివ్వడానికి మాదాల రంగారావు మరో అడుగు ముందుకు వేశారు. ఆ పరంపరలో వచ్చిన చిత్రమే ఎర్రమల్లెలు. అభ్యుదయ భావాలున్న దవళ సత్యంతో సాన్నిహిత్యం ఉండడం ద్వారా మాదాల రంగారావు రెండోసారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కూడా ధవళ సత్యం కే దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం జరిగింది. రచయిత మాదాల రంగారావు రెండోసారి కూడా పీడిత ప్రజల ఆర్థిక ఇబ్బందులు, వారి అగచాట్లను దృష్టిలో పెట్టుకుని కథ రాసుకోవడం జరిగింది. మొదటి సినిమాలో నటించిన మురళీమోహన్, చలపతిరావు, సాయిచందు, కృష్ణవేణి లాంటి వాళ్లను ఎర్రమల్లెలు చిత్రంలో తిరిగి తీసుకోవడం జరిగింది.

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, ఆ గ్రామాల్లో క్షుద్ర దేవతలు మునసబు, కరణం, కామాందు.. వీరు ఊరికి పట్టిన పీడ. ఈ ముగ్గురి అకృత్యాలు, అగచాట్లు ఏ విధంగా రూపుమాపారన్నదే చిత్ర కథాంశం. ఈ సినిమాకి ఆయువుపట్టు సంగీతం. చక్రవర్తి అందించిన సంగీతం ఎర్రమల్లెలు చిత్రానికి ప్రాణం పోసిందని చెప్పవచ్చు.. సినిమాలోని పాటల రికార్డింగ్ అయిపోయిన తర్వాత మాదాల రంగారావు పాటల క్యాసెట్ ఇంటికి తీసుకు వచ్చారు. ఆయన కొడుకు మాదాల రవి ‘నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో రామరాజ్యం తిరిగి చూడు శివా శంభు లింగో..అనే పాటకు డాన్స్ చేస్తూ కనిపించారు.

అది నచ్చడంతో ఎర్రమల్లెలు చిత్రంలో కూడా మాదాల రవిచే ఆ పాట చేపిస్తాననడంతో.. ఆ బాలుడు ఎగిరి గంతేసాడు. ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ఈ పాట షూటింగ్ తీస్తున్న క్రమంలో… బాలుడు మాదాల రవికి మేకప్ వేయకుండా ముఖానికి మట్టిపోసి, వేసుకున్న చొక్కా చింపేయడంతో.. పాపం ఆ బాలుడు నిరాశ చెందాడు. కానీ పాత్ర దృష్ట్యా ఆవిధంగా చేశారన్నది ఆయన పెద్దయ్యాక తెలిసింది. 1981 మే 1న విడుదలైన ఎర్రమల్లెలు చిత్రం విజయఢంకా మోగించింది.

అయితే‌ మాదాల రవి చెన్నైలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, మెడిసిన్ కంప్లీట్ చేయడానికి రష్యా వెళ్లడం జరిగింది. అక్కడ 14 సంవత్సరాలు నివసించి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గా వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి 2004, ధవళ సత్యం దర్శకత్వంలో ‘నేను సైతం’ చిత్రంలో నటిస్తూ, నిర్మించారు. ఈ‌ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేకపోయింది.