తెరపై అక్కాచెల్లెళ్లం.. తెరవెనుక మాత్రం టామ్ అండ్ జెర్రీలం..!!

సినీ జీవితానికి నిజ జీవితానికి ఎక్కడా పోలిక ఉండదని అంటుంటే మనం వింటాం. కానీ కొందరి రీల్ అండ్ రియల్ లైఫ్ జీవితాలను సూక్ష్మంగా పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది. సినిమా అనేది ఓ అందమైన రంగుల ప్రపంచం ఆ కలల ప్రపంచంలో ప్రేక్షకుడు తన్మయత్వం లో పడి తనను తానే మర్చిపోతాడు. కొత్త లోకంలో విహరిస్తూ కొత్త అనుభూతులను పొందుతాడు. అంతటి మహత్తరశక్తి కేవలం సినిమాకు మాత్రమే ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.

నటీ నటులు సినిమాలో వేసే పాత్రలకు, నిజ జీవితంలోని ప్రవర్తనకు ఏ మాత్రం సంబంధం ఉండదు. సాత్వికంగా నటించే నటులు నిజ జీవితంలో లో సౌమ్యులు కాకపోవచ్చు. అలాగే రౌద్రంగా నటించే వారంతా నిజ జీవితంలో చెడ్డవారు కాకపోవచ్చు. సినిమాలోని పాత్రను బట్టి నిజజీవితంలోని వారి ప్రవర్తనను ఎప్పుడూ అంచనా వేయకూడదు. పాత్రకు ప్రవర్తనకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది.

1980 దశకంలో జయసుధ,జయప్రద, శ్రీదేవి, విజయశాంతి, రాధిక, రాధ రజిని, సుహాసిని, సుమలత, మాధవి, భానుప్రియ లాంటి హీరోయిన్ల హవా కొనసాగింది. అడవి రాముడు లో జయసుధ, జయప్రద ప్రేమాభిషేకంలో జయసుధ శ్రీదేవి, కార్తీక పౌర్ణమిలో రాధిక, భానుప్రియ,పల్నాటి సింహంలో జయసుధ, రాధ ఖైదీ లో మాధవి, సుమలత త్రిశూలం లో శ్రీదేవి, రాధిక, జయసుధ ఇలా ఎంతో మంది హీరోయిన్లు అనేక సినిమాల్లో కలిసి నటించడం జరిగింది.

అయితే జయప్రద శ్రీదేవి కలిసి కొన్ని తెలుగు హిందీ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా వీరు అక్క చెల్లెలుగా చాలా సినిమాల్లో నటించారు. తెలుగులో ముందడుగు, కృష్ణార్జునులు, దేవత చిత్రాల్లో నటించారు. హిందీలో మజాల్, మౌలాలి, మక్సాద్, మవాలి, తోఫా చిత్రాలను జితేందర్ తో కలిసి నటించారు.

అయితే వీరు పేరుకు మాత్రమే తెరపై అక్కచెల్లెలుగా నటించారు. కానీ తెరవెనుక మాత్రం క్షణం ఇద్దరికీ పడేది కాదు. దేవత చిత్రం షూటింగ్ లో రాఘవేంద్ర రావు కెమెరా, యాక్షన్ అనగానే.. శ్రీదేవి, జయప్రద ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా అనురాగంతో తమ నటనను కనబరిచేవారు. ఒక్కసారిగా దర్శకుడు కట్ అని చెప్పగానే.. తమ కుర్చీలోకి వెళ్లి కూర్చునేవారు. ఇద్దరు ఎడమొఖం, పెడమొఖం పెట్టుకుని వారికి ఏది కావాలన్నా దర్శకుడితో చెప్పేవారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఇలా సెట్ లో టామ్ అండ్ జెర్రీ లా పోట్లాడుకునే వాళ్లమని జయప్రద ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.