భీమ్లానాయక్ పాటతో పాపులర్ అయిన మొగులయ్యకు ఆర్థిక సాయం అందజేసిన మంత్రి.. గంగుల కమలాకర్!

పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, బీమ్లానాయక్ పాటతో పాపులర్ అయిన తెలంగాణ కళాకారుడు దర్శనం మొగులయ్య ఈ రోజు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను హైదరాబాద్ లోని తన నివాసంలో కలిశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాట పాడి అభిమానాన్ని చాటుకున్న మొగులయ్య తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపాడు.

ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడం తాను ఎన్నటికీ మర్చిపోలేను అని మొగులయ్య గుర్తు చేసుకున్నాడు. ఆ పురస్కారమే తన జీవితాన్ని మార్చుసిందన్నారు. ఇక తన కళకు సంబంధించిన దానిని పాఠం రూపంలో ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో చేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేశాడు.

ప్రభుత్వం తరుఫున కళాకారుల ఫించన్ రూ. 10వేల సహాయాన్ని తమ కుటుంబానికి కల్పించినందుకు జీవితకాలం రుణపడి ఉంటానన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పాటను పాడి ఆలపించారు కిన్నెర మొగులయ్య. కిన్నెర వాయిద్యాన్ని అభివృద్ధి చేసి మరిన్ని వాయిద్యాలు తయారు చేసి, కళాకారులను తయారు చేయాలనే తన లక్ష్యానికి ప్రభుత్వ సాయాన్ని అభ్యర్థించాడు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కిన్నెర మొగులయ్యని శాలువాతో సన్మానించి.. తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేసారు. సీఎం కేసీఆర్ కళా, సాంస్కృతిక రంగాలకు ఎప్పుడూ అండగా ఉంటారని మంత్రి గంగులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సినిమా రంగానికి చెందిన డీఏం రవిందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు..