చిన్నపిల్లలలో కరోనా కొత్త లక్షణాలు..ప్రమాదమంటున్న నిపుణులు!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుంది.ఈ మహమ్మారి పెద్దవారిలో ఏవిధంగా ప్రభావం చూపిస్తుందో చిన్నపిల్లలలో కూడా అదే ప్రభావం చూపిస్తుంది. పెద్దలతో సమానంగా పిల్లలలో ఈ వైరస్ వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా చిన్న పిల్లలు ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడటంతో కొంత వరకు ఆందోళన కలిగిస్తుంది.

పెద్ద వారితో పోలిస్తే చిన్నపిల్లలలో వైరస్ లక్షణాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. సాధారణంగా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు నమోదుకాగా చిన్న పిల్లలలో 103 నుంచి 104 డిగ్రీల వరకు జ్వరం వస్తుంది. ఒకవేళ ఈ విధంగా నాలుగు రోజుల నుంచి వారం పాటు చిన్న పిల్లలు జ్వరంతో బాధపడుతూ ఉంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలి.

ఈ విధంగా జ్వరంతో బాధపడే చిన్నారులలో ఎప్పటికప్పుడు పల్స్ రేట్, బిపి చెక్ చేస్తూ ఉండాలి. వీటిలో ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీర్ఘకాలికంగా జలుబుతో బాధపడేవారు చిన్నారులలో ఈ ప్రభావం ఊపిరితిత్తులపై పడే అవకాశాలు ఉన్నాయి. చిన్నారులలో ముక్కుదిబ్బడ కూడా కరోనా లక్షణమేనని అధికారులు తెలియజేస్తున్నారు.

కళ్ళు, ముక్కు ఎర్రబడటం, పెదాలు పగలడం, ముఖం నీలం రంగులోకి మారడం, అలర్జీలు, నిద్రలేమి, ఆకలి లేమి సమస్యలతో బాధ పడటం కరోనా లక్షణాలని నిపుణులు గుర్తించారు.ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా సరైన చికిత్స అందించాలి. అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా పిల్లల పట్ల పెద్దలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని లేకపోతే పెద్ద ప్రమాదం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు