Nirav Modi: డబ్బుల్లేక నెలకు 10 లక్షల అప్పు చేస్తున్నా… నీరవ్ మోడీ కామెంట్స్ వైరల్!

Nirav Modi: సాధారణంగా బ్యాంకులో రుణం తీసుకున్న తర్వాత దానిని తప్పకుండా తిరిగి చెల్లించాలి. లేదా బ్యాంకు వారు మన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంటుంది . అయితే కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి అప్పుగా తీసుకుని చిల్లిగవ్వ చెల్లించకుండా దేశం విడిచి పారిపోతున్నారు. ఇలా ఇప్పటికి ఎంతోమంది కోటీశ్వరులు తీసుకున్న అప్పులు చెల్లించలేక ఐపి పెట్టి దేశాలు వదిలి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కూడా ఒకరు.

బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఎగవేసి, విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ ఇప్పుడు తన దగ్గర చిల్లిగవ్వ కూడా లేక అప్పు చేస్తున్నానని చెబుతున్నాడు. ప్రముఖ వజ్రాల వ్యాపారి మోడీ గతంలో బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు అప్పుచేసి వాటిని తిరిగి చెల్లించకుండా విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఆ తర్వాత అప్పు చెల్లించలేక దేశం విడిచి పారిపోయాడు. అయితే ప్రస్తుతం అతడి దగ్గర చిల్లిగవ్వ లేదట.

ఇటీవల నీరవ్​ను ఇండియాకు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని లండన్‌లోని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ చెల్లింపులకు సంబంధించి బర్కింగ్‌సైడ్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు నీరవ్ మోడీ వర్చువల్‌గా హాజరయ్యాడు . కోర్టు ఆదేశించిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేనని.. నెలకు 10 వేల పౌండ్ల చొప్పున కడతానని అర్జీ పెట్టుకున్నాడు.
అయితే ఆ 10 వేల పౌండ్లను ఎక్కడి నుంచి తెస్తావని న్యాయమూర్తి అడగ్గా.. ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని, భారత ప్రభుత్వం తన ఆస్తులు అన్ని జప్తు చేయటం వల్ల కోర్టుకు చెల్లించాల్సిన మొత్తం కోసం అప్పు తీసుకుంటున్నట్లు నీరవ్ చెప్పాడని తెలుస్తోంది.

Nirav Modi: వేల కోట్లు మోసం చేసిన నీరవ్ …

పీఎన్‌బీని వేల కోట్ల రూపాయలు మోసగించిన కేసులో ఇండియాకు అప్పగించే విషయంలో గతేడాది నీరవ్ మోడీకి చుక్కెదురైంది. అతడ్ని భారత్‌కు అప్పగించేందుకు లండన్‌ హైకోర్టు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. అలాగే ఈ తీర్పుపై యూకే సుప్రీం కోర్టులో అప్పీల్ చేసేందుకు నీరవ్‌కు కోర్టు నుంచి అనుమతి లభించలేదు. అయితే ఇండియాకు రాకుండా ఉండేందుకు ఆయనకు ఇంకా మార్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.