పాన్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా…? ఎలా మార్చుకోవాలంటే..?

ప్రస్తుత కాలంలో పాన్ కార్డు వల్ల ఉన్న ఉపయోగాలు అన్నీఇన్నీ కావు. మనకు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఎంత ముఖ్యమో పాన్ కార్డ్ కూడా అంతే ముఖ్యం. చాలా సందర్భాల్లో పాన్ కార్డ్ మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఉద్యోగంలో చేరే సమయంలో కంపెనీలు సైతం పాన్ కార్డ్ వివరాలను కోరతాయి. అయితే మనలో చాలామంది పాన్ కార్డ్ లో వివరాలు తప్పుగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు.

పాన్ కార్డులో తప్పులు ఉన్నాయని తెలిసినా చాలామందికి ఆ తప్పులను ఏ విధంగా సరిదిద్దుకోవాలో తెలియదు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం కోసం, ఐడెంటిటీ కార్డుగా పాన్ కార్డు ఉపయోగపడుతుంది. జీఎస్టీ చెలించాలంటే కూడా పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకులలో ఎక్కువ మొత్తంలో లావాదేవీలు నిర్వహించే వాళ్లు పాన్ కార్డ్ ఉంటే మాత్రమే ఆ లావాదేవీలను నిర్వహించడం సాధ్యమవుతుంది.

క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అయితే పాన్ కార్డ్ వివరాలు తప్పుగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సులభంగా ఇంట్లో నుంచే పాన్ కార్డ్ లోని తప్పులను సరి చేసుకునే అవకాశం ఉంది. పాన్ కార్డులో తప్పులు సరిచేసుకోవాలంటే ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌ లో సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేసి పాన్ కార్డ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.

అనంతరం పాన్ కార్డ్ రీప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఓపెన్ అయ్యే కొత్త అప్లికేషన్ లో సరైన వివరాలను పొందుపరచాలి. అనంతరం ఈకేవైసీ పూర్తి చేసి పేమెంట్ పూర్తి చేయాలి. ఆ తర్వాత అప్ డేట్ అయిన వివరాలతో కొత్త పాన్ కార్డును పొందవచ్చు.